నేటి ఆర్టిస్టులు ఎక్కడ అవకాశాలొస్తే అక్కడకు పరుగులు తీస్తున్నారు. కేవలం ఒక భాషకు చెందిన సినీరంగానికే పరిమితం కాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన ముందుకు సాగుతున్నారు. తొలుత బాలీవుడ్‌లో పరిచయమై.. అక్కడ పలు చిత్రాలలో నటించడంతో పాటు ఐటమ్ సాంగ్‌లలో కూడా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సన్నీలియోన్ ఎప్పుడో దక్షిణాది సినిమాలలో నటించడం ఆరంభించిన విషయం తెలిసిందే. తెలుగులో కరెంట్‌తీగ చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్రలో తళుక్కుమన్న ఆమె ఆ తర్వాత రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రంలో ఓ పాటలో మెరిసింది. ఇప్పుడేమో తమిళ, మలయాళ చిత్రాల్లో నటించేందుకు అమితాసక్తిని కనబరుస్తోంది.
ఇప్పటికే తమిళంలో వీరమాదేవి చారిత్రక కథాంశ చిత్రం టైటిల్ పాత్రలో నటిస్తూ తన నట విశ్వరూపాన్ని ఆ పాత్రలో చూపిస్తానని చెబుతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ, హిందీ భాషలలో కూడా విడుదల చేయబోతున్నారు. ఇక తమిళంలోనే విశాల్, రాశీఖన్నా నాయకానాయికలుగా రూపొందుతున్న అయోగ్య అనే చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నర్తించేందుకు ఆమె అంగీకరించినట్లు తెలిసింది. మరోవైపు మలయాళంలో కూడా ఆమె రెండు సినిమాలు చేస్తోంది. ఆ మధ్య కేరళకు వెళ్లినపుడు అక్కడి ప్రజలు తనపై చూసిన అభిమానానికి ఆమె ముగ్ధరాలైంది.