ఒక టాలీవుడ్ హీరో హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపించినా…
నాలుగేళ్ళకే నటన నేర్చిన ‘యువ’ కధానాయకుడు డైరెక్టర్స్ యాక్టర్ గా మారినా…
ఒక యువ హీరో అమ్మాయిల కలల రాకుమారుడుగా….కుర్రాళ్లకు యూత్ ఐకాన్ గా నిలిచినా…
ఒక యువ కధానాయకుడు నేటి సరికొత్త తరానికి కొత్త రకమైన ప్రతినిధిగా ఆవిర్భవించినా…ఆది కేవలం మన ప్రిన్స్ మహేష్ కే చెల్లింది…
నిజమే…తండ్రి సాహసమే ఊపిరిగా…ప్రయోగాలే తన సిద్దాంతాలుగా దూసుకుపోయిన సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ప్రిన్స్ మహేష్ దాదాపుగా పై ప్రాయం అంటే నాలుగేళ్లలోనే నటన నేర్చుకున్నాడు. తండ్రి ఆచరణలో ‘నీడ’ చిత్రంతో బాల నాటుడిగా సినీ అరంగేట్రం చేసిన మహేష్ తనదైన శైలిలో నటనలో ఓనమాలు దిద్దుకుని, మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. బాల నటుడిగా మెప్పిస్తూనే, వయసుతో పాటు యాక్టింగ్ స్కిల్స్, ను సైతం పెంచుకుంటూ అతి తక్కువ కాలంలోనే ఆరు అడుగుల అందగాడిగా, బాక్స్ ఆఫీస్ వద్ద రియల్ కింగ్ గా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయాడు. మరి బాల నటుడు నుంచి బ్రహ్మోత్సవం వరకూ మన ప్రిన్స్ కరియర్ ను ఒక లుక్ వేద్దాం రండి..
బాల నటుడిగా (1979- 1990)
ప్రిన్స్ మహేష్ తన నాలుగో ఏటనే 1979వ సంవత్సరంలో “నీడ” అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు.ఇక 1983లో “పోరాటం” సినిమాలో బాల నటుడిగా నటించి మెప్పించాడు. అంతేకాకుండా 1987 లో శంఖారావం, 1988లో బజారు రౌడీ, 1989లో గుడాచారి 117 సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న మన లిటిల్ ప్రిన్స్, ఆ తరువాత 1989లో బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఇక 1990లో బాలచంద్రుడు, అన్నాతమ్ముడు చిత్రంలో మరోసారి నటించి మెప్పించాడు.
రాజకుమారుడు…”రాజ”
బాలనటుడిగా తన నటనను ప్రేక్షకులకు పరిచయం చేసిన ప్రిన్స్, 6 అడుగుల అందగాడిగా, యువ హీరోగా చేసిన చేసిన తొలి సినిమా రాజకుమారుడు. ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ సాధించి ప్రిన్స్ ను ఉత్తమ నూతన నటుడుగా నంది పురస్కారంతో సత్కరించే అంతగా ఆకట్టుకుంది.
మురారి”గా”మురారి
తొలి సినిమాలో పూర్తి కమర్షియల్ కధతో రంగంలోకి దిగిన ప్రిన్స్, మురారితో సరికొత్త కధకు, కధనానికి, అంతేకాకుండా కుటుంబ బంధాల విలువలకు సరికొత్త అర్ధాన్ని చూపించాడు. ఇక ఈ సినిమాలో ఆయన నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం ఆయన చెంతన చేరింది.
టక్కరి దొంగ…”రాజు”
తండ్రి తగ్గ తనయుడిగా, ప్రయోగాలకు తాను సైతం తన తండ్రి నడిచిన బాటలోనే నడుస్తా అంటూ కౌ బాయ్ గెటప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రిన్స్. కట్ చేస్తే, సినిమాలో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒక్కడు…”అజయ్”
అప్పటి వరకూ కుటుంభ కధా చిత్రాలకు హీరోగా నటించిన మన ప్రిన్స్, లవర్ బోయ్ గానే కాకుండా, ఎమోషనల్ గా, రఫ్ క్యారెక్టర్ లో, కాస్త ఫ్యాక్షన్ టచ్ ఉన్న కధతో “ఒక్కడు”గా ప్రభంజనం సృష్టించాడు. ఆ సినిమా అప్పట్లో భారీ హిట్ సాధించడమే కాకుండా, మాస్ హీరోగా, సూపర్ స్టార్ గా, టాలీవుడ్ టాప్ హీరో గా ప్రిన్స్ ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇక ఈ చిత్రంలో మన యువరాజు నటనకు దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం దాసోహం అయ్యింది.
నిజం…”సీతారామ్”
టాలీవుడ్ టాప్ హీరోగా నిలబెట్టిన ఒక్కడు తరువాత అందరి అంచనాలను పక్కకు పెట్టి, ఏమాత్రం హీరోయిజం లేని, మరో ప్రయోగాత్మక చిత్రం “నిజం”తో అవినీతిపై పోరాడే యువకుడిగా నటించాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు ఉత్తమ నటుడుగా నంది పురస్కారం లభించడం విశేషం.
నాని..గా…నాని
మరో ప్రయోగాత్మక చిత్రం, కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా, కామెడీ, సైన్స్ ఫిక్షన్ మూవీ, ఇక ఈ మూవీలో అతని పాత్ర తీరు…చిన్న పిల్లాడిలా నటించే యువకుడి పాత్రలో ప్రిన్స్ నటన అజరామరం.
అర్జున్…”గా”…అర్జున్
అక్కను కాపాడుకునే తమ్ముడిగా, కుటుంభం కోసం నిత్యం పరితపించే యువకుడి పాత్రలో ప్రిన్స్ నటించాడు అనడం కన్నా జీవించాడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ చిత్రంలో ఆయన నటనకు యధా ప్రకారం…నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం ఆయన్ని వరించింది.
అతడు – “నందగోపాల్”…అలియాస్… “పార్ధు”
ప్రొఫెషనల్ కిల్లర్ గా అతడు సినిమాలో మహేష్ మ్యానరిజం, ఆయన యాక్టింగ్, లుక్ అన్నీ అధుర్స్ అనే చెప్పాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సందించిన పదునైన సంభాషణలకు మన యువరాజు చేసిన యాక్టింగ్ కు నంది ఉత్తమ నటుడు పురస్కారం మరోసారి ప్రిన్స్ ను వరించింది.
పోకిరి – కృష్ణ మనోహర్ ఐపీయస్
ఇప్పటికీ టాలీవుడ్ రికార్డుల పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా ‘పోకిరి’ దాదాపుగా 200 సెంటర్స్ లో 100డేస్ ఆడి అప్పటివరకూ ఉన్న రికార్డ్స్ అన్నింటికీ షాక్ ఇచ్చింది. ఇక మాస్ హీరోగా, పోలీస్ ఆఫీసర్ గా ప్రిన్స్ పాత్రకు దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది.
దూకుడు – అజయ్
కంప్లీట్ పోలీస్ పాత్రలో, మంచి కామెడీ టైమింగ్ తో ప్రిన్స్ ఈ సినిమాలో నటనను ఉతికి ఆరేసాడు. ఈ సినిమా సైతం బాక్స్ ఆఫీస్ ను కలెక్షన్స్ సునామీతో షేక్ చేసింది. ఇక ఈ సినిమాలో ప్రిన్స్ నటనకు ఇటు నంది ఉత్తమ నటుడు పురస్కారం, అటు దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం ఒకేసారి ప్రిన్స్ కౌగిలో చేరాయి.
బిజినెస్ మ్యాన్
ముంబైను పోయిస్తా అంటూ…దూకుడుగా దూసుకుపోయే పాత్రలో, సూర్య భాయ్ అంటే ఒక బ్రాండ్ అనే మ్యానరిజంతో ఈ సినిమాలో ప్రిన్స్ ఇరగదీశాడు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
పూర్తి విభిన్న పాత్రలో, వెంకీ తమ్ముడిగా, కుటుంభ కధ చిత్రంలో నటించి మెప్పించాడు ప్రిన్స్.
“1నేనొక్కడినే” – గౌతమ్
విభిన్న కధ, స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం
శ్రీమంతుడు
శ్రీమంతుడు – ఊరిని దత్తత తీసుకునే కోణంలో ఊళ్ళో ఉన్న సమస్యలపై ప్రిన్స్ ప్రతాపం అద్భుతం అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోగానే కాకుండా ఈ సినిమా నిర్మాతగానూ వ్యవహరించాడు ప్రిన్స్. ఇక ఈ సినిమాలు ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ అయ్యి కలెక్షన్స్ సునామీ సృష్టించింది
ఇలా ప్రతీ సినిమాకు డిఫరెంట్ వేరీయేషన్స్ చూపిస్తూ, తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రిన్స్ త్వరలోనే ‘బ్రహ్మోత్సవం’ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. మరి ఈ చిత్రం సైతం భారీ హిట్ ను సాధించి టాలీవుడ్ లో ప్రిన్స్ స్థానాన్ని పదిలం చెయ్యాలి అని మనస్పూర్తిగ కోరుకుంటున్నాం.