సూపర్ స్టార్ కృష్ణ గారికి గుండెపోటు రావడంతో.. ఆదివారం నాడు తెల్లవారు జామున గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు నమ్రత గారు. అయితే మొదట్లో ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే వెళ్లినట్టు సీనియర్ నటుడు, విజయనిర్మల కొడుకు అయిన నరేష్ చెప్పుకొచ్చారు. 8 మంది డాక్టర్లు కృష్ణగారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన్ని వైద్యులు కాపాడలేకపోయారు. కిడ్నీ వంటి అవయవాలు కూడా డామేజ్ అవ్వడంతో చావుతో ఆయన ఫైట్ చేసి చివరి శ్వాస విడిచారు. ఈరోజు(తెల్లవారుజామున) అంటే నవంబర్ 15 న ఆయన కన్నుమూశారు.
దీంతో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ట్రీట్మెంట్ జరుగుతున్నంత సేపు కృష్ణ గారి కూతుర్లు, అల్లుళ్ళు,మనవళ్లు, మనవరాళ్లు అంతా అక్కడే హాస్పిటల్ లోనే ఉన్నారు. మరోపక్క అభిమానులు కూడా తీవ్ర విషాదానికి లోనైనట్టు తెలుస్తుంది. కృష్ణ సొంత ఊరు అయిన తెనాలి వంటి ఏరియాల్లో అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు అని చెప్పాలి. 1942 సంవత్సరం మే 31 న జన్మించిన కృష్ణ గారు 1965 వ సంవత్సరంలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.
51 ఏళ్ళ సినీ కెరీర్లో ఆయన 345 చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన హీరోగా ఈయన చరిత్ర సృష్టించాడు. జేమ్స్ బాండ్, సస్పెన్స్ థ్రిల్లర్స్, కౌబాయ్.. వంటి ఎవ్వరూ టచ్ చేయని జోనర్లలో సినిమాలు చేసి హిట్లు మీద హిట్లు కొట్టారు.
ఇక ఆయన వ్యక్తిగత జీవితం కూడా అందరికీ తెరిచిన పుస్తకమే. ఇందిరా దేవి గారు కృష్ణగారి మొదటి భార్య. అయితే తర్వాత ఆయన విజయ నిర్మల గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక 2019 లో విజయనిర్మల గారు మరణించగా, ఈమధ్యనే ఇందిరా దేవి గారు కూడా మరణించారు. ఇక కృష్ణ గారి వయసు 80 ఏళ్ళు అన్న సంగతి తెలిసిందే.