నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ .. తెలుగులో తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి 70 ఎంఎం, ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సినిమాలను పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనది.. రికార్డులు, అవార్డులు, సాహసాలకు అయితే తిరుగే లేదు. త్వరలో కృష్ణ చిత్రాలకు సంబంధించిన విశేషాలతో కృష్ణ మెమోరియల్‌ను ఏర్పాటు చేయనున్నారు కుటుంబ సభ్యులు. ఆయన నటించిన సినిమాలతోనే కాదు కేవలం ఒకే ఒక్కపాటలో కనిపించి కూడా కలెక్షన్ల కనకవర్షం కురిపించారు.
అదే ‘యమలీల’.. హీరో హీరోయిన్లు లేకుండా ఒకే పాట చేసిన కృష్ణ గారి ఫోటోతో వేసిన ‘యమలీల’ 100 రోజుల పోస్టర్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతకొద్ది రోజులుగా సూపర్ స్టార్ చిత్రాలకు సంబంధించిన వార్తలు మీడియా, సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ‘యమలీల’లో కృష్ణ స్పెషల్ సాంగ్ గురించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం.. తనకు ‘నంబర్ వన్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కృష్ణా రెడ్డి వచ్చి ‘యమలీల’ లో స్పెషల్ సాంగ్ చేయమని అడగడంతో..
ఈ పాట సందర్భం ఏంటి.. ఈ సాంగ్ చేయడం వల్ల తన ఇమేజ్‌కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? లాంటివేమీ ఆలోచించకుండా.. కృష్ణ ఎస్ చెప్పడం అనేది ఆయన సంస్కారానికి నిదర్శనం.. అదే ‘జుంబారే’ సాంగ్.. సాంగ్‌లో సూపర్ స్టార్ సింపుల్ అండ్ స్టైలిష్ స్టెప్స్, వయసుతోపాటు పెరిగిన గ్లామర్, కాస్ట్యూమ్స్ చూసి అందర్నీ ఆశ్చర్య పోయారు. కథలోని సందర్భానికి తగినట్టు చిత్ర గుప్తుణ్ణి ఎంటర్‌టైన్ చేయడానికి యమధర్మరాజు చేసే క్రియేషనే ఈ సాంగ్..
ఫ్యాన్స్, ఆడియన్స్ తెరమీద పూలతో పాటు డబ్బులు కూడా చల్లేవారంటే కృష్ణ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. కేవలం కృష్ణ సాంగ్ చూడ్డానికే రిపీట్ ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చేవారు. 75 లక్షల రూపాయలతో నిర్మించిన ‘యమలీల’ 12 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం అనేది అప్పట్లో సెన్సేషన్.. అన్ని మెయిన్ సెంటర్లలో ఏకధాటిగా 100 రోజులు ఆడేసింది. శతదినోత్సవ వేడుకలకు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్స్ ముఖ్య అతిథులుగా విచ్చేసి.. మూవీ టీంకి షీల్డ్స్ ఇచ్చారు.