మహేష్ బాబు- రాజమౌళి..ల ‘గ్లోబ్ ట్రోటర్’ ప్రాజెక్టుకి ‘వారణాసి’ టైటిల్ ఫిక్స్ చేశారు. దాని కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్లో మహేష్ బాబు స్పీచ్ మళ్ళీ హైలెట్ గా నిలిచింది. మహేష్ బాబు మాట్లాడుతూ..”అందరికీ నమస్కారం.. చాలా రోజులు అయిపోయింది బయటకొచ్చి. కొంచెం కొత్తగా ఉంది. కానీ చాలా బాగుంది. మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం. స్టేజి మీదకి సింపుల్ గా నడిచొస్తాను సార్ అన్నాను. కుదరదు అన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు. సరే సార్ సింపుల్ గా నా స్టైల్లో ఓ బులుగు(బ్లూ) చొక్కా వేసుకుని వస్తాను చెప్పాను.
అది కూడా కుదరదు అన్నారు. చూశారుగా ఎంట్రీ ఇలా ప్లాన్ చేశారు. లేదు అని చెప్పి ఈ చొక్కా ఇచ్చారు. గుండీలు లేవు అని అన్నాను. కొన్ని గుండీలు పెట్టండి అన్నాను. కుదరదు ఇదే స్టైల్ అన్నారు. ఇంకా నయం చొక్కా తీసేయమని చెప్పలేదు. నెక్స్ట్ అదేనేమో. ఇదంతా మీ కోసమే. మీ అందరి పేషెన్స్ కి థాంక్యూ. అప్డేట్ అప్డేట్ అన్నారుగా. ఎలా ఉంది అప్డేట్? మన డైలాగ్ లోనే చెప్పాలి.. ‘దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది’. నాన్న గారు అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు. ఆయన చెప్పే ప్రతీ మాట వినేవాడిని. ఒక్క మాట తప్ప. నన్ను పౌరాణికం సినిమాలు చేయమని నాన్నగారు అడిగేవారు. నువ్వు గెటప్పుల్లో చాలా బాగుంటావ్ అని అనేవారు.

కానీ ఆయన మాట నేను వినలేదు. ఇప్పుడు ఆయన నా మాటలు వింటారు. హ్యాపీగా ఫీలవుతారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనకి ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. ముఖ్యంగా మా డైరెక్టర్ గర్వపడేలా కష్టపడతాను. ‘వారణాసి’ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇండియా మొత్తం మనల్ని బట్టి గర్విస్తుంది. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
