మెగాస్టార్ చిరంజీవితో ఫొటోలు దిగడానికి చాలా మంది ఎదురుచూస్తుంటారని.. అందులో ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఉంటారని అన్నారు ఉత్తేజ్. ఇటీవల ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో చిరంజీవితో బండారు దత్తాత్రేయ కుటుంబసభ్యులు, బంధువులు ఫొటోలు దిగుతుండగా.. గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా ఈ విషయంపై నటుడు ఉత్తేజ్ మీడియాతో మాట్లాడారు. చిరంజీవి అందరూ కావాలనుకుంటారని.. అందరితో ఫొటోలు దిగుతారని చెప్పారు. బ్లడ్ బ్యాంక్ దగ్గర రెండు, మూడొందల మంది చిరుతో ఫొటో దిగాలని లైన్ లో ఉంటారని..
వారి కోసం ఆయన అలానే కదలకుండా ఉంటారని ఉత్తేజ్ అన్నారు. ఫొటోకి ఉన్న వాల్యూ ఆయనకు తెలుసని.. ఎవరైనా ఫ్యామిలీ వెళ్లి ఆయనతో ఫొటో దిగితే.. రెండు మూడు గంటల్లో వాళ్లింట్లో ఆ ఫొటో ఉంటుందని అన్నారు. ఎందుకంటే ఇక్కడ కెమెరామెన్ తో ఫొటో తీయించుకుంటారు.. ఫొటో మనకి రాదేమో అనే బాధ వాళ్లకు ఉంటుంది. కానీ అలా జరగకుండా చిరు చూసుకుంటారని చెప్పుకొచ్చారు ఉత్తేజ్. గరికపాటి నరసింహారావు సభలో బిజీగా ఉన్నప్పుడు కూడా కొంతమంది వెళ్లి సెల్ఫీలు అడుగుతారని..
వారికి అదొక పిచ్చి అని తెలిపారు ఉత్తేజ్. చిరంజీవి గారితో ఫొటోలు దిగాలనే పిచ్చితో బతికేవాళ్లమని అన్నారు. చిరంజీవి గారిని ముట్టుకునే గుక్కపెట్టి ఏడ్చేస్తుంటారని.. తను కూడా ఏడ్చినట్లు చెప్పారు ఉత్తేజ్. 1996లో సారధి స్టూడియోస్ లో మొదటిసారి ఆయన్ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చానని.. ఆ సమయంలో తెగ ఏడ్చేసినట్లు చెప్పారు.
అలానే సురేఖావాణి లాల్ బహదూర్ స్టేడియంలో చిరంజీవిని ముట్టుకొని గుక్కపెట్టి ఏడ్చిందని గుర్తుచేసుకున్నారు. అలాంటి కొన్ని వందల మందిని తను చూసినట్లు వివరించారు ఉత్తేజ్. అలాంటి వ్యక్తిని గరికపాటి నరసింహారావు ఒక సభలో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని ఉత్తేజ్ అన్నారు. చిరంజీవితో వారంతా ఫొటోలు దిగుతుంటే.. మీరు తట్టుకోలేకపోయారా..? అని గరికపాటిని ప్రశ్నించారు.