నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అప్పుడు మనం ఏ ఊరులో ఉన్నా మన ఊరులో ఉన్నట్లే ఉంటుంది అని చెబుతుంటారు పెద్దలు. సినిమా ఇండస్ట్రీలో ఈ నానుడి బాగా నప్పుతుంది అని చెప్పొచ్చు. ఒక ప్రాంతంలో పుట్టి మరో ప్రాంతానికి చెందిన ఇండస్ట్రీలో నటించినప్పుడు… అందరూ సపోర్టు చేయాలని కోరుకుంటారు. ఈ క్రమంలో కొంతమందికి ఇబ్బందికరమైన స్పందన వస్తుంది. అయితే అందరితో చక్కగా ఉంటే ఎక్కడైనా రాణించొచ్చు అని నిరూపించిన నటుల్లో మాధవన్ ఒకరు. అందుకే ఆయన దర్శకుడిగా ఓ సినిమా చేస్తాను అంటూ స్టార్ హీరోలు ముందుకొచ్చి నటిస్తున్నారు. అది కూడా ఉచితంగా.
ఇస్రో ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా మాధవన్ ఓ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటివరకు నటనకు మాత్రమే పరిమితమైన మాధవన్ తొలిసారి ఈ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు. మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఈ సినిమాను జూలై 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాధవన్ ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
‘రాకెట్రీ’ సినిమాలో షారుఖ్ ఖాన్, సూర్య గెస్ట్ రోల్స్ చేశారట. అయితే ఈ క్రమంలో వారు సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని చెప్పాడు మాధవన్. సూర్య అయితే సొంత ఖర్చుతో ముంబయి వచ్చి మరీ నటించి వెళ్లాడట. షారుఖ్ అయితే ఈ సినిమా నటించే అవకాశం ఇవ్వమని అడిగి మరీ నటించాడట. ‘జీరో’ సినిమాలో షారుఖ్‌తో మాధవన్ కలసి నటించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ‘రాకెట్రీ’ సినిమా గురించి చర్చ వచ్చిందట. ఆ తరువాత ఓ పార్టీలో షారుఖ్ – మాధవన్ ఎదురుపడ్డారట.
అప్పుడు ‘బ్యాగ్రౌండ్‌లో అయినా కనిపించే చిన్న పాత్ర ఇవ్వొచ్చుగా’ అని మాధవన్‌ను షారుఖ్ అడిగాడట. షారుఖ్ సరదాకి అలా అన్నారేమో అనుకొని మాధవన్ నవ్వేశాడు. అయితే ఆ తర్వాత మాటలకు థ్యాంక్స్ చెబుదామని ఫోన్ చేస్తే.. ఆయన మేనేజర్ అందుకుని ‘సర్ డేట్స్ ఎప్పుడు కావాలని అడుగుతున్నారు?’ అని అన్నారట. దీంతో మాధవన్ షాక్ అయ్యారట. అలాగే సూర్య తన క్రూతో పాటు వచ్చి మరీ షూట్‌లో పాల్గొన్నారని మాధవన్ చెప్పాడు. ఇండస్ట్రీలో తను అవుట్ సైడర్ అయినప్పటికీ.. ఈ స్థాయికి ఎదగడానికి చాలా మంది సాయం చేశారని మాధవన్ గొప్పగా చెప్పాడు.