కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సూర్య. త్వరలోనే ఆయన తెలుగు స్ట్రెయిట్ సినిమా చేస్తారని టాక్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సూర్య తన 42వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా శివ వ్యవహరిస్తున్నారు. ఇదివరకు ఆయన ఎన్నో మాస్ సినిమాలను తెరకెక్కించారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది.
అదేంటంటే.. ఈ సినిమాను ముందుగా 3డీ యానిమేషన్ లో తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు 3D ఫార్మాట్ లో సినిమాను తెరకెక్కించబోతున్నారు. అలానే సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ రెండు భాగాలను కూడా పండగల సందర్భంగా విడుదల చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు.ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్ గా కనిపించనుంది. వీరిద్దరితో పాటు యోగిబాబు, కోవై సరళ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో సూర్య ఒక యుద్ధ వీరుడు పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఒక అంతుచిక్కని వ్యాధితో ఆయన 16వ శతాబ్దంలో చనిపోతే… ప్రస్తుత కాలంలో ఉన్న ఒక యువతి.. ఆయన ఏ కారణంతో చనిపోయాడని రీసెర్చ్ చేసే పాయింట్ తో సినిమా ఉంటుందట. స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా సినిమా అంటే భారీ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలను ఇలా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తూ.. ప్రేక్షకుల్లో మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు. రాజమౌళి ‘బాహుబలి’ రెండు భాగాలుగా రిలీజ్ అయింది. ‘పొన్నియిన్ సెల్వన్’ కూడా రెండు భాగాలుగానే ప్లాన్ చేశారు. ఇప్పుడు సూర్య సినిమా కూడా అలానే ప్లాన్ చేస్తున్నారు. మరి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!