తెలుగులో కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్ గా కనిపించిన తాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన తరువాత ఆమె ఇమేజ్ మొత్తం మారిపోయింది. సరికొత్త కథలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకత చాటుకుంటుంది. ‘పింక్’, ‘బద్లా’ వంటి సినిమాలు తాప్సీకి మంచి పేరు తీసుకొచ్చాయి. గతేడాది ‘తప్పడ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తాప్సీ ఇప్పుడు ‘హసీనా దిల్ రూబా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడి ఉండడంతో ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ వస్తున్నాయి. తాప్సీతో పాటు లీడ్ రోల్స్ చేసిన విక్రాంత్, హర్షవర్ధన్ రాణేలు పెర్ఫార్మన్స్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ కథ, కథనాల్లో లోపం వలన సినిమాకి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. కథ కొత్తగా ఉన్నప్పటికీ.. ఆసక్తికరంగా రూపొందించలేకపోయారు. సెకండ్ హాఫ్ లో చెప్పుకునే విధంగా ఒక్క సన్నివేశం కూడా లేదు. ఎప్పటిలానే తాప్సీ తనతో మెప్పించినప్పటికీ ఆమె పెర్ఫార్మన్స్ ఒక్కటే సరిపోలేదు.
క్లైమాక్స్ సన్నివేశాలు తేలిపోయాయి. ఈ సినిమాకి రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ కథ అందించారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో దర్శకుడు వినిల్ మాథ్యూ కంటే కూడా కనికానే ఎక్కువగా విమర్శిస్తున్నారు. గతంలో ‘సైజ్ జీరో’, ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమాల విషయంలో కూడా కనికా ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.