తమన్నా (Tamannaah) గురించి గత కొన్ని నెలలుగా రెండు వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ఆమె ప్రేమ అయితే, రెండోది ఆమెకొస్తున్న సినిమా ఆఫర్లు. అవును ఆమెకు అవకాశాలు తగ్గాయని, అందుకే చిన్న చిన్న సినిమాలు, ప్రత్యేక గీతాలు చేస్తోంది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు నటుడు విజయ్ వర్మతో (Vijay Varma) ఆమె ప్రేమ ముక్కలైందని కూడా వార్తలొచ్చాయి. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు విషయాల మీద దాదాపు క్లారిటీ ఇచ్చేసింది.
ఆమె ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓదెల 2’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో సినిమా గురించి చెప్పడంతోపాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొంత క్లారిటీ ఇచ్చింది. నటిగా తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నా అంటూ తన ‘ఓదెల 2’ (Odela 2) సినిమా గురించి చెప్పింది తమన్నా. శివశక్తిగా ఆమె నటించిన ఆ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.
ఆ సినిమా ప్రచారం కోసం ఆమె బయటికొస్తే.. ‘పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు?’ అని ఓ వ్యక్తి అడిగారు. దానికి ఆమె ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు అని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న నటుడు విజయ్ వర్మ- తమన్నాకు బ్రేకప్ అయిందనే వార్తకు బలం చేకూరినట్లు అయింది. ఇక ఆఫర్లు లేకపోవడంతో చిన్న సినిమాల్లో నటిస్తున్నారా? అని అడిగితే.. నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదు అని తేల్చింది.
కంటెంట్ బాగుంటేనే ఆ ప్రాజెక్ట్ పెద్ద సినిమా అవుతుందని, బాగోలేకపోతే చిన్న సినిమా అవుతుందని తనదైన లాజిక్ చెప్పింది. నటిగా కెరీర్ ప్రారంభంలో తాను నటించిన ‘హ్యాపీడేస్’ (Happy Days) సినిమాలో ఎనిమిది ప్రధాన పాత్రలు ఉన్నాయని. అలా తన ప్రయాణం ప్రధాన నటుల్లో ఒకరిగా మొదలైందని తెలిపింది. ఇక డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టే ‘స్త్రీ 2’ (Stree 2) సినిమాలో ఐటెమ్ సాంగ్ ఓకే చేశా అని పూర్తి క్లారిటీ ఇచ్చింది.