గతకొంతకాలంగా కోలీవుడ్ సినీ నిర్మాత మండలిలో వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే నిర్మాతల మండలికి విశాల్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం చాలా మందికి ఇష్టం లేదు. దీంతో విశాల్ పై ఆరోపణలు ఎక్కువయ్యాయి. విశాల్ మెంబెర్స్ అందరూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని… అలాగే విశాల్ వ్యవహారశైలితో కూడా చిన్న నిర్మాతలు నష్టపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విశాల్ మీద ఆరోపణలు ఎక్కువ కావడంతో తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఈ వ్యవహరాలు ఏడాది పాటూ పర్యవేక్షించడానికి శేఖర్ అనే అధికారిని కూడా నియమించింది. వచ్చే ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకూ అన్ని విషయాల్లో శేఖర్ అనే అధికారి ప్రమేయం ఉంటుందని సమాచారం. విశాల్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే దానికి శేఖర్ అనుమతి తీసుకోవాల్సిందేనట. ఈ రకంగా విశాల్ ను డమ్మీ ప్రెసిడెంట్ చేసిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా విశాల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ విశాల్ పై ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం విశాల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ విషయాల పై అయన ఎలా స్పందిస్తాడో చూడాలి.