తెలుగు సినిమా ఓ స్థాయికి ఎదిగాక ‘ఆ నలుగురు’ అనే కాన్సెప్ట్ మొదలైంది. ఆ నలుగురు అనే పదం కామన్‌గా ఉన్నా.. అందులో ఉండే వ్యక్తులు మారుతూ వస్తున్నారు. దీంతో ఎప్పుడు పరిశ్రమలో సంధి దశ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, థియేటర్ల చర్చ జరిగినా ‘ఆ నలుగురు’ అనే పదం డిస్కషన్‌లోకి వస్తుంది. మొన్నీమధ్య ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల, థియేటర్ల బంద్ నేపథ్యంలో మరోసారి ‘ఆ నలుగురు’ అనే కాన్సెప్ట్ బయటకు వచ్చింది. ‘అందులో మేం లేం’ అంటూ కొంతమంది బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి ఆ కాన్సెప్ట్ బయటకు తీశారు.
కొంతమంది తెలుగు సినిమా పరిశ్రమను గుప్పిట్లో పెట్టుకున్నారని, తెరవెనక ఉండి ఇండస్ట్రీని శాసిస్తున్నారు అంటూ ఓ నలుగురు విషయంలో టాలీవుడ్‌లో చర్చ జరుగుతూనే ఉంది. ఎన్నో విషయాలను కంట్రోల్ చేద్దాం అంటూ పరిశ్రమ ప్రారంభిస్తున్నా పనులు జరగడం లేదు అంటూ వాళ్ల మీద విమర్శలు వస్తుంటాయి. ‘హరి హర వీరమల్లు’ విడుదల పంచాయితీ తేలగానే ఈ చర్చ ఆగిపోయింది. అయితే ఇప్పుడు అప్పుడు నో చెప్పిన ఆ నలుగురే ‘ఆ నలుగురు’ అని తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు.
టాలీవుడ్‌లో అంతా బాగుంది.. ఆల్ ఈజ్ వెల్ అని అనుకోవడానికి లేదు అని తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ బ్యాడ్ పొజిషన్‌లో ఉందన్నారు. ‘కోర్టు’, ‘బలగం’ లాంటి చిన్న సినిమాలు అడపాదడపా విజయం సాధిస్తున్నాయని, ఇలాంటి విజయాల సంఖ్య ఇంకా పెరగాలి అని ఆయన మాటల ఉద్దేశం. అలాగే థియేట్రికల్ సిస్టమ్‌లో మార్పులు రావాలని, లేదంటే పరిశ్రమ మనుగడ కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల చేస్తారనుకున్న సమయంలో.. థియేటర్ల బంద్ నినాదం బయటకు రావడం, దానిపై పవన్ కల్యాణ్ స్పందించడం జరిగిన వెంటనే.. టాలీవుడ్ నుండి అల్లు అరవింద్, ఏషియన్ సునీల్, దిల్ రాజు, శిరీష్ లాంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చి స్పందించిన విషయం తెలిసిందే.