‘మట్కా’ (Matka) సినిమా గురించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మొదలు.. కథ విషయంలో అంతోకొంతో సమాచారం ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసులకు ‘మట్కా’ ఆట గురించి తెలుసు కాబట్టి. అయితే ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) టీజర్, ట్రైలర్.. ఇప్పుడు సినిమా వచ్చాక ‘మట్కా’ గురించి కొత్త డౌట్స్ మొదలయ్యాయి. ఆ సినిమాకు, ఈ సినిమాకు లింక్ పెడుతూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ‘మట్కా’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దాంతో పాటు కాస్త క్లారిటీ కూడా వచ్చింది అంటున్నారు.
Matka
అదేంటి.. ట్రైలర్‌లో కానీ, ఆ ట్రైలర్ ప్రెస్ మీట్‌లో కానీ ఆ విషయమే లేదు కదా అంటారా? అవును మీరు చెప్పింది కరెక్టే. అయితే సినిమా టీమ్ మాటలు వింటుంటే మా కథ ఇది అని చెప్పడంతోపాటు.. కొంతమంది అనుకుంటున్నట్లు ‘లక్కీ భాస్కర్’ కథకు, మా సినిమా కథకు సంబంధం లేదు అని చెప్పారు అనిపిస్తోంది. దీంతో క్లారిటీ ఇచ్చినట్లే అని కూడా అంటున్నారు. వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే ‘మట్కా’.
మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌లో.. సినిమా కథ గురించి కాస్త చెప్పుకొచ్చారు. వాసు అనే వ్యక్తి ప్రయాణమే ‘మట్కా’ కథ అని చెప్పిన టీమ్.. 1950వ దశకంలో చిన్నతనంలోనే శరణార్థిగా బర్మా నుండి విశాఖపట్నానికి వస్తాడు. అక్కడ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎలా ‘మట్కా’ కింగ్‌లా మారాడు అనేదే సినిమా కథ అని టీమ్ చెప్పింది.
అయితే ఈ సినిమా వెనుక ఓ వ్యక్తి ఉన్నాడు అని దర్శకుడు తెలిపారు. రతన్ ఖత్రి అనే గ్యాంబ్లర్ జీవితాన్ని ఆధారంగా తీసుకొని ‘మట్కా’ అనే ఫిక్షనల్ కథను సిద్ధం చేశానని తెలిపారు. రతన్ ఖత్రి లాంటి వ్యక్తి విశాఖపట్నంలో పుడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతోనే సినిమా చేశా అని చెప్పారు.