‘జాతి రత్నాలు’ సినిమాలో ముగ్గురు ప్రధాన పాత్రధారులు ఉన్నా.. జోగిపేట శ్రీకాంత్ పాత్ర భలే హైలైట్ అయింది. ఆ పాత్రను పోషించిన నవీన్ పొలిశెట్టి కోసమే దర్శకుడు అనుదీప్ కేవీ రాసి ఉంటారు అని కచ్చితంగా అనిపిస్తుంది. నిన్నమొన్నటివరకు ఇదే అనుకుని ఉంటారు అందరూ. అయితే ఆ సినిమా టైమ్‌లో ఈ పాత్ర వేరే హీరో నుండి నవీన్ దగ్గరకు వచ్చింది అనే స్టీరియో టైప్ లీక్ అయితే ఏమీ రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఆ పాత్ర కోసం తొలుత అప్రోచ్ ఐయిన హీరో పేరు బయటకు వచ్చింది.
అవును జోగిపేట శ్రీకాంత్ పాత్రకు తొలి హక్కుదారు నవీన్ పొలిశెట్టి కాదు. ఆ పాత్రను తొలుత విన్నది తేజ సజ్జా. అవును మన సూపర్ యోధానే తొలుత ఆ కథను విన్నాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. ఆయన హీరోగా నటించిన ‘మిరాయ్’ సినిమా విడుదల (సెప్టెంబరు 12న) సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కొన్ని కామెంట్స్ చేశాడు. కానీ వివిధ కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయా అని చెప్పాడు తేజ సజ్జా. అయితే ఆ పాత్రకు నవీన్ పొలిశెట్టినే కరెక్ట్ అని చెప్పాడు.
అశోక చక్రవర్తి దగ్గర 9 దైవ గ్రంథాలు ఉండేవనే ఓ కల్పిత పురాణం ఆధారంగా ‘మిరాయ్’ సినిమాను రూపొందించారు. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాలతో పరిష్కారం లభిస్తుందనేది సినిమాలో మెయిన్ పాయింట్. దుష్ట ఆలోచనలున్న మనిషి చేతిలోకి ఆ జ్ఞాన గ్రంథాలు వెళ్లిపోతే ఏం జరుగుతుంది అనేది కథ. ఆరేళ్ల క్రితం వచ్చిన ఆలోచనను స్క్రిప్ట్‌గా రాయడానికి సమయం పట్టిందట. తేజ సజ్జా, మంచు మనోజ్, రితిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉందని దర్శకుడు తెలిపారు.
ఇదంతా ఓకే కానీ తేజ సజ్జా ఆ సినిమాను ఎందుకు వద్దనుకున్నాడో ఏమో. ఒకవేళ చేసుంటే కెరీర్ ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడైతే సూపర్ హీరో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మరి.