స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో పాల్గొని తేజస్వి మరింత పాపులర్ అయింది. అయితే షోలో బూతులు మాట్లాడడం, గొడవలు పెట్టుకోవడం వలన షో నుంచి వెనక్కి వచ్చింది. మళ్ళీ వెళ్ళడానికి అవకాశమొచ్చినా ప్రేక్షకులు మాత్రం నూతన్ నాయుడు, శ్యామలను లోపలి పంపించారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన తేజస్వి అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. “నేనసలు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌కే వెళ్లాల్సింది. కుదరలేదు. తర్వాత ‘మా’ అవార్డ్స్ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ -2 కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. అలా సెకండ్ సీజన్‌లో బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యాను. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.
నాన్నకు ఆల్కహాల్ ప్రాబ్లమ్. దాంతో పదిహేడేళ్లకే నేను ఇంట్లోంచి బయటకు వచ్చేశా. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా. పదేళ్ల నుంచి ఒంటరిగా ఉండటం వల్లేమో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలా నడుచుకోవాలో తెలీలేదు. చుట్టూ కెమెరాలున్నాయి అనే ధ్యాస లేకుండా నా స్వభావానికి తగ్గట్టే బిహేవ్ చేశాను. టీవీలో అందరూ చూస్తుంటారు అన్న స్పృహ లేకుండా పక్కనున్న మనిషి గురించి హౌజ్‌లో కొంతమంది ఏదిపడితే అది మాట్లాడుతుంటే చాలా కోపం వచ్చింది. దాంతో అరిచేశా.” అని తన కోపానికి గల కారణాన్ని వెల్లడించింది. సామ్రాట్ గురించి వివరిస్తూ “నిజానికి సామ్రాట్ నాకు ఎనిమిదేళ్ల కిందటే పరిచయం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా. అంత క్లోజ్ కాదు అప్పుడు.
అసలు సామ్రాట్‌కి పెళ్లి అయిందని, అది ప్రాబ్లమ్‌లో ఉందని హౌజ్‌లో అతనితో మాట్లాడుతుంటేనే తెలిసింది. సామ్రాట్ ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. దాంతో అతనితో కనెక్ట్ అయ్యా. క్లోజ్ ఫ్రెండ్‌గా మారాడు. అంతమాత్రాన నన్ను ట్రోల్ చేయడమేనా? ఒక అమ్మాయి.. ఒక అబ్బాయితో ఎమోషనల్‌గా అటాచ్ కావడం తప్పా? ఎవరితో ఎంత మేరకు స్నేహం చేయాలి.. ట్రోలర్స్ డిసైడ్ చేస్తారా? నా పర్సనల్ స్పేస్ నాకు ఉండదా? హౌజ్‌లో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు. బయటకు వచ్చాక తెలిసింది కొంతమందైతే సామ్రాట్‌తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒక మనిషితో ఉన్న క్లోజ్‌నెస్‌ను పెళ్లితో ముడిపెడతారా? సామ్రాట్ నాకు మంచి ఫ్రెండ్ ఎప్పటికీ. డౌటే లేదు” అని తేజస్వి క్లారిటీ ఇచ్చింది.