రీసెంట్ గా ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు మరోసారి పవన్ కళ్యాణ్ నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాయి. విశాఖలో జరిగిన పరిణామాలకు నిరసనగా పవన్ స్టార్ ఓ రేంజ్ లో వైసీపీ మీద ఎదురుదాడి చేశారు. దీంతో ఆ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. పవన్ ని టార్గెట్ చేస్తూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. దీని ప్రభావం వచ్చే ఏడాది విడుదల కాబోయే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల మీద పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా 2023 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడానికి రీసెంట్ గా వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు. ఈలోగానే ఏపీలో ఇష్యూ వచ్చింది. ఇదివరకు ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ సమయంలో బెనిఫిట్ షోలు లేకుండా జగన్ సర్కార్ కట్టడి చేసిన విషయం తెలిసిందే. ‘భీమ్లానాయక్’ సినిమాకి అయితే ఏకంగా రెవెన్యూ అధికారులను థియేటర్ల వద్ద కాపలా పెట్టి మరీ టికెట్స్ ను సాధారణ రేట్లకు అమ్మించారు. ఇది ఓవరాల్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపించింది.
ఆ కారణం వలనే బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ‘హరిహర వీరమల్లు’ విషయంలో కూడా ఇలానే చేస్తే దాని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అయితేనే లాభాలు వస్తాయి. తెలంగాణలో టికెట్ రేట్స్ హైక్ గురించి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ పవన్ మీద కోపంతో ఏపీలో మళ్లీ ఇదివరకు చేసినట్లుగా చేస్తే ఆ భారం నిర్మాత మీద పడుతుంది.
తక్కువ రేట్లకు టికెట్లను అమ్మితే బిజినెస్ వర్కవుట్ అవ్వదు. తక్కువ బడ్జెట్ సినిమాలకైతే ఇబ్బందులు ఉండవు కానీ ‘హరిహర వీరమల్లు’ లాంటి సినిమా అయితే కచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. మరి అప్పటికి ఈ వేడి చల్లారుతుందేమో చూడాలి!