మంచి దర్శకుడితో సినిమా చేస్తే హిట్ అవుతుందని హీరో అనుకుంటాడు. పెద్ద బ్యానర్లో చేస్తే సినిమా విజయం సాధిస్తుందని డైరక్టర్ నమ్ముతాడు. సినిమాకి బాగా ప్రచారం చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తాయని నిర్మాత భావిస్తారు. ఇదంతా కేవలం నమ్మకాలని మాత్రమే అని అనేక చిత్రాలు తేల్చి చెప్పాయి. స్టార్ హీరో, హీరోయిన్, స్టార్ డైరక్టర్, బడా నిర్మాత, అన్ని మీడియాలో పబ్లిసిటీ చేసినా.. బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డ సినిమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అందుకే దర్శకనిర్మాతలు తమ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా .. నచ్చదా.. అనే టెన్షన్ లో ఉన్నారు. గూఢచారి సినిమా కన్నా చిలసౌ సినిమాకు ప్రచారం ఎక్కువ జరిగింది. గూఢచారి సినిమాతో సమానంగా చిలసౌ సోషల్ నెట్ వర్క్ లో హడావుడి చేసింది. చిలసౌకి మంచి టాక్ నే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ లేవు. కలెక్షన్లు నిలబడలేదు. హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఆంధ్ర అంతా కాలేజీల్లో హీరో హీరోయిన్లు చేసిన హడావుడి ఇంతాఅంతా కాదు.
కానీ ఓపెనింగ్స్ చూస్తే తేడా. ఈవారం విడుదల అయిన శ్రీనివాస కళ్యాణం. పబ్లిసిటీలో ఎక్కడా లోటులేదు. సినిమాను మూడురోజులు ముందే బయ్యర్లకు ప్రదర్శించారు. వన్ పర్సంట్ నెగిటివ్ టాక్ లేదు. కానీ ఓపెనింగ్స్ చూస్తే నిరాశ. కారణాలు అనేకం.. సోషల్ మీడియాలో అభిమానుల హడావుడి ఎక్కువగా ఉండడంతో టీజర్, ట్రైలర్ కి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. లైకులు, షేర్లు ఇప్పుడు కొనుక్కుంటున్నారు. అందుకే సోషల్ మీడియా ప్రచారం నమ్ముకుంటే ఫలితం వేరేగా ఉంటోంది. ఇక న్యూస్ ఛానళ్ల ప్రకటనల రేటు తక్కువగా ఉండడంతో వారికే యాడ్స్ ఇస్తున్నారు. అందువల్ల సినిమాల గురించి మహిళలకు చేరడం లేదు. ఇలా ఎన్నో అంశాలు దర్శకనిర్మాతలు మాయలో పడేస్తున్నాయి. త్వరలో నర్తనశాల, శైలజారెడ్డి అల్లుడు, అమర్ అక్బర్ ఆంథోని, హలోగురూ ప్రేమకోసమే, అరవింద సమేత వీర రాఘవ, సవ్యసాచి వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఎన్టీఆర్ సినిమాకి మినహా మిగతా చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ రావడం గగనమే అంటున్నారు సినీ పండితులు. అందుకే తొలిరోజు గడిచే వరకు ఫిలిం మేకర్స్ లో టెన్షన్ టెన్షన్.