ప్రస్తుతం వరుస సినిమాలతో సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman).. మళ్లీ ముఖానికి రంగేసుకోనున్న విషయం తెలిసిందే. దాదాపు 22 ఏళ్ల తర్వాత తమన్ నటించడానికి ఓ సినిమాకు ఓకే చెప్పారు. అయితే ఇన్నేళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు నటిస్తున్నారు అనే ప్రశ్న చాలామంది మనసులో ఉంది. తాజాగా ఈ ప్రశ్నకు నవ్వుతూ ఓ సరదా ఆన్సర్ ఇచ్చేశారు తమన్. అయితే అసలు కారణం మాత్రం చెప్పలేదు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఇదయమ్ మురళి’ అనే సినిమాను ఇటీవల అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అథర్వ మురళి (Atharvaa), తమన్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తమన్ సచిన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్‌ఎం ఇదే సినిమాలో నటిస్తున్నారు. ఆమె భర్తగానే తమన్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
ఇన్నేళ్లు నటించని మీరు ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నారు అని అడిగితే.. ‘ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు అందుకే’ అని నవ్వేశారు తమన్. మరి ‘ఇదయమ్ మురళి’ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడగ్గా.. ‘నేను షూటింగ్‌కు వెళ్లినప్పుడు’ అని నవ్వుతూ చెప్పారు తమన్. సంగీత దర్శకుడిగా వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ‘ఇదయమ్ మురళి’ సినిమాను వాయిదా వేస్తున్నానని తమన్‌కల్ఆరిటీ ఇచ్చారు. ఇప్పటికే జరిగిన ఓ షెడ్యూల్‌లో పెళ్లి సీన్‌లో నటించాను అని తమన్ చెప్పేశారు.
22 ఏళ్ల క్రితం ‘బాయ్స్’ (Boys) సినిమాలో తొలిసారి తమన్ నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే సంగీత దర్శకుడు అయ్యారు. దీంతోపాటు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా విషయంలోనూ తమన్ స్పందించారు. ఆ సినిమా పైరసీ కాపీ వచ్చిందని, సోషల్ మీడియాలో సినిమాపై ట్రోల్స్ వచ్చాయని.. ఇదంతా చూస్తుంటే కావాలనే ఇదంతా చేశారని అనిపిస్తోందని చెప్పారు తమన్. అంతేకాదు ఈ విషయంలో నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) ఎవరూ మద్దతు ఇవ్వకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు తమన్.