తమన్ అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి కాపీ ట్యూన్లు, డప్పు చప్పుళ్ళు, ఎలక్ట్రానిక్ ట్యూన్స్ పేరుతో మనోడు కొట్టే బ్యాగ్రౌండ్ స్కోర్. సంగీత దర్శకుడిగా ఫాస్టెస్ట్ 50 చేసిన తమన్ కు సంగీత దర్శకుడిగా గతేడాది చెప్పుకోదగ్గ విజయం ఒక్కటి కూడా లేదు. అయితే.. సినిమాల సక్సెస్ తో సంబంధం లేకుండా తమన్ కి కాస్త మంచి పేరు తీసుకొచ్చిన చిత్రాలు “విన్నర్, రాజుగారి గది”. అయితే.. తన మ్యూజిక్ రెగ్యులర్ అయిపోతుందని భావించాడో లేక ఇలా కొనసాగితే తన ఉనికిని కాపాడుకోవడం కష్టమని భావించాడో తెలియదు కానీ.. తన పంధా మార్చాడు తమన్. అందుకు నిదర్శనమే “తొలిప్రేమ” ఆడియో.
అద్భుతమైన పాటలు అని చెప్పలేం కానీ.. సంగీతంతోపాటు సాహిత్యం కూడా అర్ధమవుతూ ఆహ్లాదపరిచే ఆల్బమ్ అని చెప్పడంలో ఎలాంటి ఇబ్బందిలేదు. ఆల్బమ్ లోని “అల్లసాని వారి, సునోనా సునైనా, నిన్నలా” పాటలు రిపీట్ లో వినేలా ఉన్నాయి. తను రెగ్యులర్ గా సంగీతం సమకూర్చే ఆల్బమ్స్ లో మహా అయితే ఒక మెలోడీ ట్యూన్ ప్రిపేర్ చేసే తమన్.. తొలిసారి “తొలిప్రేమ” కోసం ఏకంగా 3 మెలోడీలు కంపోజ్ చేయడమే కాక ఆ ట్యూన్స్ తో శ్రోతలను మెప్పించడం గమనార్హం. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న అతితక్కువ మంది సంగీత దర్శకుల్లో తమన్ ఒకడు. అటువంటి తమన్ తన పంధాను మార్చుకొని ఇలా సినిమా కథకి తగ్గట్లుగా సరికొత్త ట్యూన్స్ కంపోజ్ చేసుకుంటూ ముందుకెళితే తప్పకుండా అగ్ర సంగీతదర్శకుల్లో ఒకడిగా మిగులుతాడు.