వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న దిల్ రాజు, నితిన్ ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలన్న ధ్యేయంతో చేసిన సినిమా “తమ్ముడు” (Thammudu). శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ మంచి అంచనాలు నమోదు చేసింది. ప్రమోషన్స్ విషయంలో చాలా ఆర్గానిక్ గా వ్యవహరించారు దిల్ రాజు & టీమ్. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? నితిన్ హిట్ కొట్టగలిగాడా? అనేది చూద్దాం..!!
కథ: ఇండియా నుంచి ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించడం కోసం ప్రిపేర్ అవుతుంటాడు జై (నితిన్). అయితే.. చిన్నప్పుడు తన అక్క విషయంలో చేసిన తప్పు కారణంగా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండిపోయి.. ఎందుకో సరైన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతుంటాడు. అది గమనించిన అతడి స్నేహితురాలు చిత్ర (వర్ష బొల్లమ్మ) జైను తన అక్క దగ్గరకు తీసుకెళ్తుంది.
అయితే.. ఆప్యాయంగా తన అక్క స్నేహలత (లయ)ను ఆలింగనం చేసుకుందామనుకున్న జైకి ఆపదలో ఉన్న ఝాన్సీ కిరణ్మయిగా అంబరగొడుగులో తారసపడుతుంది.
తన అక్క & ఫ్యామిలీని క్షేమంగా అంబరగొడుగు నుండి బయటికి తీసుకెళ్లడమే జై ధ్యేయంగా మారుతుంది.
అసలు కిరణ్మయికి ఎవరి నుంచి ప్రాణ హాని ఉంది? ఆ సందర్భం దేనివల్ల వల్ల వచ్చింది? జై & కో ఆ అడవి నుంచి సురక్షితంగా బయటపడగలిగారా? అనేది “తమ్ముడు” (Thammudu) సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
నటీనటుల పనితీరు: నితిన్ లో ఎందుకో అలసత్వం కనిపించింది. పాత్రలో ఉన్న ఎమోషన్ అదే అయినప్పటికీ.. అతడి కళ్లల్లో కూడా నీరసం కనిపించింది. అక్కడక్కడా వచ్చే ఎమోషనల్ సీన్స్ లో కాస్త పర్వాలేదు కానీ.. ఓవరాల్ గా మొదటిసారి నటుడిగా మెప్పించలేకపోయాడని చెప్పాలి.
రీఎంట్రీలో లయ మరోసారి తన సత్తా చాటుకుంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా కాస్త ఆసక్తికరంగానే ఉంది.
వర్ష బొల్లమ్మ తనలోని డిఫరెంట్ యాంగిల్ ను ఈ సినిమాతో పరిచయం చేయాలనుకుంది. సప్తమిగౌడ పేరుకే హీరోయిన్ కానీ.. హీరో కాంబినేషన్ లో ఒకే ఒక్క సీన్ ఉంది. ఆమె డైలాగ్స్ మాత్రం చిరాకుపెట్టించాయి. ఎంత అడివి అయినా ఇంకా ఆ యాస ఎవరు మాట్లాడుతున్నారు అనేది దర్శకుడు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది.
సౌరభ్ సచదేవ్ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం బాగుంది. అయితే.. అతడ్ని ఒక రూమ్ లో అలా ఉంచేసి కథ మొత్తం నడిపించడం అనేది వర్కవుట్ అవ్వలేదు. సౌరభ్ నటన మాత్రం ఆకట్టుకుంది.
సాంకేతికవర్గం పనితీరు: సినిమా మొత్తానికి ఉన్న అతికొద్ది ప్లస్ పాయింట్లలో ఒకటి అజనీష్ లోక్నాథ్ నేపథ్య సంగీతం. కాస్తో కూస్తో ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇక గుహన్-సత్యజిత్-సమీర్ ల త్రయం విడతలవారీగా సినిమాటోగ్రాఫర్స్ గా వర్క్ చేసి ఉండడంతో ఆ లైటింగ్ డిఫరెన్సులు కనిపిస్తాయి. డి.ఐతో మ్యాగ్జిమమ్ కవర్ చేయడానికి ప్రయత్నించారు కానీ.. పెద్దగా కన్విన్స్ చేయలేకపోయారు.
ఎడిటింగ్, సీజీ, కలరింగ్ వంటి టెక్నికాలిటీస్ తమ శక్తి మేరకు ప్రాజెక్ట్ ను కాపాడడానికి ప్రయత్నించారు.
దర్శకుడు వేణు శ్రీరామ్ “తమ్ముడు” (Thammudu) కథను ఒక రేసీ థ్రిల్లర్ గా రూపొందించాలనుకున్న ఆలోచన బాగుంది, కోర్ పాయింట్ కూడా బాగుంది. అయితే.. కథనం సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. అలాగే.. డైలాగ్స్ లో ఎమోషన్ మిస్ అయ్యింది. అందువల్ల శ్రీరామ్ ఆలోచనలు బాగున్నా.. వాటిని తెరపై పండించిన విధానం వర్కవుట్ అవ్వలేదు. పోలీసులు సరిగ్గా బోర్డర్ దగ్గరకి వచ్చి ఆగిపోవడం, మగధీర తరహా ఫైట్ సీన్ వంటివి అస్సలు లాజికల్ గా లేకపోవడం అనేది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఓవరాల్ గా.. శ్రీరామ్ వేణు కథకుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.
విశ్లేషణ: కొన్ని కథలు పేపర్ మీద బాగుంటాయి. అయితే.. ఆ కథను రెండున్నర గంటల సినిమాగా మలిచినప్పుడు కేవలం కోర్ పాయింట్ సరిపోదు, డ్రామా పండాలి, ఎమోషన్ వర్కవుట్ అవ్వాలి. అన్నిటికీ మించి ఆడియన్స్ ఆ కథతో ట్రావెల్ చేయాలి. “తమ్ముడు” సినిమాలో ఇవన్నీ లోపించాయి. ఆ కారణంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. నితిన్ ఫ్లాప్ స్ట్రిక్ నుంచి “తమ్ముడు” బయటపడేయలేకపోయిందనే చెప్పాలి.
ఫోకస్ పాయింట్: తమ్ముడు బాగా తడబడ్డాడు!
రేటింగ్: 2/5