అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ (Thandel) . ఈ సినిమా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్(Bunny Vasu) నిర్మిస్తుండగా, చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా వస్తోంది. ఉత్తరాంధ్రలో మత్స్యకారుల జీవితాలను ప్రేరణగా తీసుకొని ఈ సినిమా కథను రూపొందించారు. ప్రత్యేకంగా శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకొని, అందుకు తగ్గ డబ్బింగ్ కూడా చెప్పడం చైతన్య చేస్తున్న కష్టాన్ని తెలియజేస్తోంది.
సంక్రాంతికి ‘తండేల్’ విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. కానీ అదే సమయంలో రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ చేంజర్’ (Game Changer) , వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా థియేటర్లలోకి రావడం ఖాయమైంది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా వస్తుండడంతో గీతా ఆర్ట్స్ పోటీని నివారించే ఉద్దేశంతో ‘తండేల్’ వాయిదా వేయాలని నిర్ణయించవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వెంకటేష్ సినిమాతో మామ-మేనల్లుడు మధ్య పోటీ లేకుండా ఉండాలని చైతన్య భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నవంబర్ 4న మేకర్స్ ఈ సినిమాపై మీడియా మీట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే సినిమా విడుదల తేదీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మేకర్స్ సంక్రాంతికి కాకుండా జనవరి 25ని కూడా విడుదల తేదీగా అనుకుంటున్నట్లు సమాచారం. కానీ ఆ తేదీ అనుకూలంగా ఉంటుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. జనవరి 25ని ప్రైమ్ డేట్‌గా భావించినా, అప్పుడు ఇతర సినిమాలు కూడా రావడం వల్ల కాస్త నష్టమే అని కొందరు అంటున్నారు.
ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) ఫీమేల్ లీడ్‌గా నటిస్తుండగా, చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా కావడం విశేషం. వీరిద్దరి జంటను మరోసారి స్క్రీన్ పై చూసే అవకాశం ఉందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నవంబర్ 4న జరిగే మీడియా మీట్‌లో మూవీ విడుదల తేదీపై పూర్తి స్పష్టత రాబోతుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు.