Thangalaan Review in Telugu: తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
August 15, 2024 / 03:43 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
విక్రమ్ (Hero)
మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు (Heroine)
పశుపతి, డానియల్ తదితరులు.. (Cast)
పా.రంజిత్ (Director)
కె.ఈ.జ్ఞానవేల్ రాజా - పా.రంజిత్ - జ్యోతి దేశ్ పాండే (Producer)
జి.వి.ప్రకాష్ కుమార్ (Music)
ఏ.కిషోర్ కుమార్ (Cinematography)
Release Date : ఆగస్ట్ 15, 2024
అణగారుతున్న బ్రతుకులు మునుపంటిన అదిమి పెట్టుకొన్న బాధలను తెరపై పండించడంలో సిద్ధహస్తుడు పా.రంజిత్ (Pa. Ranjith) . “మద్రాస్” మొదలుకొని మొన్నామధ్య వచ్చిన “సార్పట్ట” వరకు ప్రతి సినిమాలో దళితుల సమస్యల గురించి బాహాటంగా పోరాడిన అతికొద్దిమంది దర్శకుల్లో పా.రంజిత్ ప్రస్తుత తరంలో ఒకడు. అతడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “తంగలాన్” (Thangalaan) . విక్రమ్ (Vikram) , మాళవిక (Malavika Mohanan) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి పా.రంజిత్ ఆ అంచనాలను అందుకోగలిగాడో లేదో చూద్దాం..!!
Thangalaan Review
కథ: బ్రిటిష్ దొర క్లెమెంట్ (డానియల్)(Daniel Caltagirone) కు బంగారం మైన్ చేసి డబ్బు సంపాదించాలన్న ధ్యేయం. అందుకు తంగలాన్ (విక్రమ్) సహాయం కోరతాడు. తాతముత్తాతల నుండి బంగారం కనిపెట్టడంలో మంచి పేరున్న తంగలాన్ అందుకు అంగీకరించి దొరతోపాటు ఒక చిన్న బృందాన్ని తీసుకొని అడవిలోకి వెళతాడు. బంగారానికి దగ్గరవుతున్న కొద్దీ మంత్రగత్తె ఆరతి (మాళవిక మోహనన్) తంగలాన్ బృందాన్ని తెగ ఇబ్బంది పెడుతుంది.
అసలు ఆరతి ఎవరు? ఎందుకని తంగలాన్ బృందాన్ని ఇబ్బంది పెడుతుంది? చివరికి బంగారం దొరికిందా? అందుకు తంగలాన్ బృందం ఎన్ని కష్టాలు పడింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “తంగలాన్” (Thangalaan) చిత్రం.
నటీనటుల పనితీరు: విక్రమ్ ఫలానా పాత్ర బాగా చేశాడు, జీవించాడు అని చెప్పడం రొటీన్ అయిపోతుంది. కానీ.. ఈ సినిమా కోసం విక్రమ్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. దళితుడిగా విక్రమ్ ఆహార్యం,బాడీ లాంగ్వేజ్ నిజంగా అప్పట్లో జనాలు ఇలానే ఉండేవారేమో అని నమ్మేలా ఉన్నాయి. అంత చక్కగా పాత్రలో ఒదిగిపోయాడు విక్రమ్. ఆరతి పాత్రలో కనిపించేది మాళవిక మోహనన్ అని గుర్తుపట్టడానికి చాలా సమయం పట్టింది. ఆమెకు వేసిన మేకప్ కానీ, ఆమె కాస్ట్యూమ్స్ కానీ ఆ స్థాయిలో ఉన్నాయి.
మాళవికలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా (Thangalaan) ఇది. ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల్లో ఆమె అందాల ప్రదర్శనను మాత్రమే చూస్తూ వచ్చిన వారికి ఆమె నటించగలదు అని చెప్పిన సినిమా ఇది. పార్వతి తిరువొత్తు పోషించిన పాత్రలో ఆమె తప్ప ఎవరూ నటించలేరు. సహజత్వం కూడా చిన్నబుచ్చుకునేలా గంగమ్మ పాత్రలో ఇమిడిపోయింది. పశుపతి (Pasupathy) , డానియల్ తదితరులు సపోర్టింగ్ రోల్స్ లో ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: కిషోర్ కుమార్ (A.Kishore Kumar) సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి చాలా కీలకమైన అంశం అని చెప్పాలి. ప్రీక్లైమాక్స్ లో రాత్రి మరియు చీకటిని ఒకేసారి చూపిస్తూ భిన్నమైన భావాలను తెరపై పండించడం అనేది ఛాయాగ్రాహకుడి పనితనానికి ప్రతీక. అలాగే.. క్లైమాక్స్ లో బంగారు మేనితో విక్రమ్ గుహ నుండి బయటకు వచ్చే సన్నివేశం కూడా కళాత్మకంగా తెరకెక్కించాడు. దర్శకుడు పా.రంజిత్ అధములుగా, చరిత్రహీనులుగా అగ్రవర్ణాలు తొక్కినెపెట్టిన దళితులు అనుభవించిన బాధలను తెరపై ప్రెజెంట్ చేయడంలో ఎప్పట్లానే విజయం సాధించాడు.
అతడి మునుపటి సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాలో పొయిటిక్ రీప్రేజంటేషన్ బాగుంది. ప్రేక్షకులకు ఒక వైవిధ్యమైన అనుభూతిని ఇస్తూనే.. తరతరాలుగా దళితులు ఎదుర్కొన్న కష్టాలను అద్భుతంగా పండించాడు. అయితే.. ఒక కథకుడిగా కంటే దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు రంజిత్. అన్నిటికంటే ముఖ్యంగా మన మూలాలను కాపాడుకోవడం ఎంత ముఖ్యం అనే అంశాన్ని కళాత్మకంగా చెప్పుకొచ్చిన విధానం సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచింది.
జి.వి.ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. నేపథ్య సంగీతంతో సన్నివేశాలను, ఎమోషన్స్ ను చక్కగా ఎలివేట్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది కానీ.. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో ఇంకాస్త ఖర్చు చేసి ఉంటే బాగుండేది. చాలా చోట్ర జంప్ కట్స్ తో కవర్ చేయాల్సి వచ్చింది.
విశ్లేషణ: ఇది అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదించే సినిమా (Thangalaan) కాదు. చరిత్రలో చోటు చేసుకొన్న రాజకీయ, కుల, మత విద్వేషాలు, సమీకరణల గురించి కనీస స్థాయి అవగాహన ఉంటే తప్ప థియేటర్లలో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయలేరు. అయితే.. విక్రమ్ కష్టం, దళిత వర్గాలపై రంజిత్ కి ఉన్న అమితమైన అభిమానం, జి.వి.ప్రకాష్ సంగీతం & కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ కోసం ఈ చిత్రాన్ని ఒక విభిన్నమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: నువ్ కోరుకున్నది కాదు, నీకు దక్కాల్సింది మాత్రమే నీ సొంతం అని మరోసారి గుర్తుచేసిన “తంగలాన్”.
రేటింగ్: 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus