అనసూయ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కాన్సెప్ట్ ఫిలిమ్ “థ్యాంక్యూ బ్రదర్”. టైటిల్, పోస్టర్, టీజర్ & ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలను సృష్టించాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కుదరకపోవడంతో.. ఆహా యాప్ ద్వారా నేడు విడుదలైంది. మరి సినిమా కూడా ప్రచార చిత్రం స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!
కథ: ఫ్యాక్టరీ యాక్సిడెంట్ లో భర్తను కోల్పోయి, అత్తగారితో కలిసి బ్రతుకుతుంటుంది ప్రియ (అనసూయ భరద్వాజ్). తండ్రి చనిపోయాక తల్లి వేరే పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమెను హార్ట్ చేస్తూ, ఓ ప్లేబాయ్ లా పెరుగుతాడు అభి (విరాజ్ అశ్విన్). ఈ ఇద్దరు వ్యక్తులు ఒకానొక సందర్భంలో ఒక లిఫ్ట్ లో కలుసుకోవాల్సి వస్తుంది. ఆ లిఫ్ట్ ఫెయిల్ అవ్వడం, సెల్లార్ రెండు అంతస్తుల కింద ఇరుక్కోవడం జరుగుతుంది.
తల్లి అంటే కనీస స్థాయి అభిమానం లేని అభి.. తల్లి కాబోతున్న ప్రియకు ఎలా సహాయపడ్డాడు? అనేది “థ్యాంక్యూ బ్రదర్” కాన్సెప్ట్.
నటీనటుల పనితీరు: అనసూయ నుంచి పాత్రకు తగిన పెర్ఫార్మెన్స్ ను రాబట్టుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఆమె క్యారెక్టర్ ను కూడా సరిగా ఎలివేట్ చేయలేదు. భర్త చనిపోయి కష్టాలుపడుతున్న ఆడదిగానే ఆమెను ప్రొజెక్ట్ చేశాడు కానీ, ఎక్కడా ఆమె మనోధైర్యాన్ని ఎలివేట్ చేయలేదు దర్శకుడు. అందువల్ల అనసూయ పాత్ర ఓ సగటు మహిళ పాత్రలాగే అనిపిస్తుంది తప్పితే.. సినిమాలో కీలకపాత్రలా కనిపించదు.
విరాజ్ అశ్విన్ తన పాత్రలో జీవించేశాడు. ఎమోషనల్ సీన్స్ లో తేలిపోయాడు కానీ.. స్పాయిల్ట్ బ్రాట్ గా మాత్రం ఆకట్టుకున్నాడు. అనీష్ కురువిళ్ల, మోనికా రెడ్డి, అన్నపూర్ణమ్మ, వైవా హర్ష, కాదంబరి కిరణ్ తదితరులు తమ పాత్రలకు తగినట్లుగా అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాకి చాలా ముఖ్యమైన నేపధ్య సంగీతం విషయంలో గుణ బాలసుబ్రమణియన్ తన 100% ఇవ్వలేదు అనిపిస్తుంది. ప్రసవ వేదన పడుతున్న ఓ పడతిని ఫ్రేమ్ చూపిస్తున్నప్పుడు పండాల్సిన ఎమోషన్ & పండంటి బిడ్డను తొలిసారి చేతిలో పట్టుకున్న కుర్రాడి కళ్ళల్లో కనబడాల్సిన ఎమోషన్ ను కెమెరామెన్ ఎంత ఎలివేట్ చేసినా.. సంగీత దర్శకుడిగా సదరు సన్నివేశాలను హృద్యంగా ప్రేక్షకుల మెదళ్ళలోకి దూరిపోయేలా చేయాల్సిన బాధ్యతను గుణ విస్మరించాడు. అందువల్ల కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్ కంటెంట్ ఉన్నా.. ఎలివేట్ అవ్వలేదు.
సురేష్ రగుటు సినిమాటోగ్రఫీ బడ్జెట్ కి తగ్గట్లు ఉంది. కలర్ గ్రేడింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. లైటింగ్ వరకూ వేరియేషన్ చూపించడానికి ప్రయత్నించాడు కానీ, సన్నివేశం, ఎమోషన్ కి తగ్గట్లు టింట్ కలర్ ను మాత్రం మార్చలేకపోయాడు. అందువల్ల ఎమోషన్ అనేది ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు.
దర్శకుడు ఒక సాధారణ పాయింట్ ను అసాధారణంగా చూపించాలని ప్లాన్ చేసుకున్నాడు కానీ, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. 92 నిమిషాల నిడివి ఉన్న సినిమాలో లెక్కకుమిక్కిలి పాత్రలతో ఒక ఎమోషనల్ కంటెంట్ ను హృద్యంగా తీయలేకపోయాడు. అన్నపూర్ణమ్మ-అనసూయ కాంబినేషన్ లో వచ్చే ఆడపిల్ల ఎందుకు పుట్టకూడదు అనే సన్నివేశం కూడా ఓ హిందీ యాడ్ కమర్షియల్ ను దింపేయడం గమనార్హం. ఓవరాల్ గా.. దర్శకుడిగా రమేష్ బొటాబోటి మార్కులతో నెట్టుకొచ్చాడు. అనసూయ లాంటి ఒక పెర్ఫార్మర్ & బుల్లితెర స్టార్ ను మాత్రం ప్రమోషన్స్ మినహా సరిగా వినియోగించుకోలేదు.
విశ్లేషణ: ఓ పడతి కష్టాన్ని, ఒంటరి ఆడదాని బాధని చక్కని నటనతో అనసూయ ఎలివేట్ చేసిన విధానం హృద్యంగా ఉంటుంది. ఆమె నట ప్రతిభ & క్యారెక్టర్ ఆర్క్ సినిమాకి ప్లస్ పాయింట్స్. విరాజ్ క్యారెక్టర్ ప్రెజంట్ జనరేషన్ యూత్ కి కొన్ని అంశాల్లో కనెక్ట్ అవుతుంది. కొన్ని సందర్భాలు, సన్నివేశాలు రిలేటబుల్ గా ఉన్నాయి. సో, థాంక్యూ బ్రదర్ సినిమాను ఆహా యాప్ లో ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు. ఎడిటింగ్, నేపధ్య సంగీతం, సీన్ కంపోజిషన్స్ ఇంకాస్త బెటర్ గా ఉండి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది.