కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ గా ఎదగడం వెనుకున్న కథ చాలా మందికి తెలియదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ, కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా చేస్తూ సూర్య ఒక విలక్షణ నటుడిగా పేరు సంపాదించాడు. కానీ కెరీర్ ఆరంభంలో సూర్య నటనలోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారణం ఒక అప్పు అని ఇటీవలే పంచుకున్నాడు. కంగువ (Kanguva) మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సూర్య, తన మొదటి జాబ్ గురించి, అలాగే సినిమాలోకి రావడానికి గల కారణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
చదువు పూర్తయ్యాక ఒక గార్మెంట్ కంపెనీలో సూర్య 3 ఏళ్లు పనిచేసి, నెలకు 8 వేల జీతం సంపాదించేవాడట. అయితే తన తల్లి ఒక సమయంలో పాతిక వేల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకుని ఆ డబ్బుతో కుటుంబానికి సపోర్ట్ ఇచ్చారట. ఆ అప్పు తీర్చడానికి తల్లి పడుతున్న ఇబ్బందిని గమనించిన సూర్య, తండ్రికి తెలియకుండా నటనలోకి అడుగుపెట్టాడు. సూర్య నటించిన తొలి సినిమా ‘నెర్రుక్కు నెర్’. దర్శకుడు వసంత్ డైరెక్షన్ లో విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో సూర్య కీలక పాత్రలో కనిపించాడు.
ఈ సినిమా ద్వారా వచ్చిన పాతిక వేల రూపాయలు తల్లి అప్పు తీర్చడానికి ఇచ్చాడని సూర్య చెప్పుకొచ్చాడు. అలా మొదలైన ఈ నటనా ప్రయాణం సూర్యను నేషనల్ లెవెల్ హీరోగా మార్చింది. సూర్య తన కష్టపడి చేసిన ప్రతి పాత్రలోనూ పూర్తి అంకితభావం చూపాడు. అందుకే, తన నటన, వినూత్న కథలను ఎంచుకునే ధైర్యం సూర్యను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. కేవలం సూర్య మాత్రమే కాదు, అతని తమ్ముడు కార్తి కూడా తమిళంతో పాటు తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇటీవలే కార్తి (Karthi) నటించిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) మంచి విజయం సాధించింది. ఫ్యాన్స్ ఇప్పటికీ సూర్య-కార్తి కలిసి ఒక మల్టీస్టారర్ చేయాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు వారి ఇద్దరికీ సరిపోయే కథ దొరకట్లేదని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి, అప్పు తీర్చేందుకు హీరోగా మారిన సూర్య, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా అభిమానులని మంత్రముగ్ధులను చేస్తున్నాడు.