చిన్నప్పుడే ఇంట్లో నుండీ పారిపోయిన హీరో … తరువాత పెద్ద ప్రయోజికుడు అయ్యి … మళ్ళీ తన సొంత గూటికి చేరుకుంటాడు. ఈ లైన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చూసాము. ఇప్పుడు ఓ స్టార్ హీరో జీవితంలో ఇది నిజమయ్యింది అని తెలీడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. వివరాల్లోకి వెళితే… ‘కె.జి.ఎఫ్’ చిత్రంతో ఇండియా వైడ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు యష్. ఆ చిత్రం కన్నడ సినిమా స్థాయిని పెంచింది అనే చెప్పాలి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందుతోన్న సంగతి కూడా తెలిసిందే.’కె.జి.ఎఫ్ చాప్టర్ 2′ పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం హీరో యష్ తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపారు. యష్ మాట్లాడుతూ…”నేను ఇంటి నుండీ పారిపోయి బెంగళూరుకు వచ్చేశాను. ఈ నగరానికి చేరుకున్న తర్వాత నాకు చాలా భయమేసింది. ఇది చాలా పెద్ద సిటీ కాబట్టి నాకు ఆ టైములో టెన్షన్ వచ్చింది. అయితే నా ఆత్మవిశ్వాసాన్ని నేనెప్పుడూ కోల్పోలేదు. సమస్యలను ఎదుర్కోవడానికి కూడా నేనెప్పుడూ భయపడలేదు. బెంగళూరుకు వచ్చే సరికీ నా పాకెట్‌లో కేవలం 300 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను తిరిగి ఇంటికి వెళితే నా తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వరని నాకు తెలుసు. నటుడిగా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నా.
ఒకవేళ నేను నటుడ్ని కాలేకపోతే.. నా తల్లిదండ్రులు ఏం చెబితే అది చేయాల్సిన పరిస్థితి. నేను తిరిగి ఇంటికి వచ్చేస్తానని మా అమ్మానాన్న అనుకున్నారు.కానీ నేను థియేటర్‌లో నటించడం మొదలుపెట్టా. నా అదృష్టవశాత్తూ ఓ వ్యక్తి నన్ను థియేటర్‌కు తీసుకున్నాడు. ఆ సమయంలో నాకు దాని గురించి ఏమీ తెలియదు. పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాను. టీ ఇవ్వడం నుంచి ప్రతిదీ చేశా.. ఎన్నో ప్రదేశాలు తిరిగాను. స్టేజీపై నా తొలి ప్రదర్శనను గుర్తించి, అవకాశం ఇచ్చారు. నా సినీ జీవితంలో విజయాలతో పాటు అపజయాల్ని కూడా చూశాను.అయితే వాటిని పట్టించుకోకుండా నటన పై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల నేడు ఈ స్థాయిలో ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.