ఈమధ్య బయోపిక్ లు అన్నీ పొలిటికల్లీ డ్రివెన్ సినిమాలు అయిపోయాయి. గబుక్కున ఏదైనా నిజమైన సంఘటన ఆధారంగా సినిమా వస్తుంది అంటే.. అది ఏ పొలిటికల్ పార్టీని పొగడడానికో అనే సంశయం మొదలైంది. అందుకు భిన్నంగా బాలీవుడ్ నుంచి వచ్చిన ఓ స్ట్రయిట్ ఫార్వర్డ్ & సింపుల్ సినిమా “ది డిప్లోమాట్” (The Diplomat). జాన్ అబ్రహాం టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం 2017లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం. మరి ఈ సినిమాతోనైనా జాన్ అబ్రహాం హీరోగా హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం.!!
కథ: 28 ఏళ్ల భారతీయురాలు ఉజ్మా అహ్మద్ (సాదియా ఖతీబ్) ఆన్లైన్ ఫ్రెండ్ షిప్ కారణంగా ఓ పాకిస్తానీ వ్యక్తిని గుడ్డిగా నమ్మి పాకిస్థాన్ వచ్చి అతడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తీరా పాకిస్థాన్ వచ్చాక ఆమె మోసపోయింది అని తెలుసుకుంటుంది. అక్కడ నుంచి బయటపడడానికి వేరే మార్గం లేక ఇండియన్ ఎంబస్సీకి చేరుకుంటుంది.
అక్కడ ఇండియన్ డిప్లొమాట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జేపీ సింగ్ (జాన్ అబ్రహాం) శరణు కోరి వచ్చిన ఉజ్మా అహ్మద్ ను ఇండియా తిరిగి పంపించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? అందుకు అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అనేది “ది డిప్లొమాట్” (The Diplomat) కథాంశం.
నటీనటుల పనితీరు: జాన్ అబ్రహాంను ఎప్పడూ యాక్షన్ సీన్స్ లో చూసి బోర్ కొట్టేసింది. కొన్నాళ్ల క్రితం “పరమాణు”లో చూసినప్పుడు ఎలాంటి డిఫరెంట్ ఫీలింగ్ కలిగిందో.. ఇప్పుడు “ది డిప్లొమాట్”లో చూసినప్పుడే అదే తరహా రిలీఫ్. ఒక నటుడు తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలు చేసినప్పుడు ఆడియన్స్ కు కచ్చితంగా ఒక రిఫ్రెషింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది. మనసులో సంఘర్షణను ముఖంలో కనిపించనివ్వకుండా చేసిన విధానం అలరించింది.
మోసపోయిన యువతిగా సాదియా ఖతీబ్ బేలతనాన్ని, అసహాయతను పండించిన విధానం ఆకట్టుకుంది. ఆమె పాత్రతో ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. లాయర్ క్యారెక్టర్లో కుముద్ మిశ్రా చిన్నపాటి హాస్యాన్ని పండించగా.. షరీబ్ హష్మీ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. సుష్మ స్వరాజ్ గా రేవతిని మంచి పాజిటివ్ వైబ్ ను తీసుకొచ్చారు. ఆమె ముఖంలో కనిపించే శాంతి తెరపై భలే ఎలివేట్ అయ్యింది.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ & ఆర్ట్ వర్క్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. ఇండియన్ ఎంబస్సీని రీక్రియేట్ చేయడంలో కానీ, ఇండియాలోనే పాకిస్తాన్ పరిసరాలను చూపించినట్లుగా మ్యానేజ్ చేయడం కానీ నీట్ గా వర్కవుట్ అయ్యాయి. నేపథ్య సంగీతం సినిమా మూడ్ ని బాగా ఎస్టాబ్లిష్ చేసింది. పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా చివర్లో రెహమాన్ “రోజా” సినిమాలోని పాట రీమిక్స్ వెర్షన్ మంచి హై ఇచ్చింది.
దర్శకుడు శివం నాయర్ ఒక నిజమైన కథను కమర్షియాలిటీ కోసం మరీ ఎక్కువగా డీవియేట్ చేయకుండా సింపుల్ ఎమోషన్స్ & ఎలివేషన్స్ తో అలరించాడు. జాన్ అబ్రహాం యాక్షన్ ఇమేజ్ ను కాస్త అణిచిపెట్టి.. అతడిలోని నటుడ్ని వినియోగించుకోవడంలోనే సగం విజయం సాధించాడు. అలాగే.. ఆస్కారం ఉన్నా ఎక్కడా అసభ్యత అనేది లేకుండా సినిమాలోని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం. ఓవరాల్ గా దర్శకుడిగా, కథకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు శివం నాయర్.
విశ్లేషణ: మంచి సినిమాలు, అందులోనూ పొలిటికల్ గా కనెక్టెడ్ గా ఉండి, ఒకరివైపు తూలిపోకుండా నిక్కచ్చిగా సినిమా తీయడం అనేది చాలా అరుదు. అలాంటి అరుదైన మంచి సినిమా “ది డిప్లొమాట్”. చిన్నపాటి బయోపిక్ లాంటి ఈ సినిమాతో జాన్ అబ్రహాం చాన్నాళ్ల తర్వాత మంచి హిట్ కొట్టాడు అనే చెప్పాలి.
ఫోకస్ పాయింట్: డీసెంట్ & డిప్లొమెటిక్!
రేటింగ్: 3/5