రష్మిక మందన్న నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రిలీజ్‌కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రష్మిక స్టార్‌డమ్, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ అండతో ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీ మొత్తాన్ని రాబట్టింది. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో బయ్యర్లు పోటీ పడి మరీ హక్కులను సొంతం చేసుకున్నారు.ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కులు కలిపి ఏకంగా రూ.21 కోట్లకు అమ్ముడయ్యాయి.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కుల కోసం రూ.14 కోట్లు చెల్లించింది. శాటిలైట్ రైట్స్ ద్వారా రూ.4 కోట్లు వచ్చాయి. ఆడియో రైట్స్ రూ.3 కోట్లకు అమ్ముడయ్యాయి. థియేటర్లలో అడుగుపెట్టక ముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం సినిమాపై ఉన్న అంచనాలకు నిదర్శనం.’చి.ల.సౌ’తో నేషనల్ అవార్డు గెలుచుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు.

‘మన్మథుడు 2’ తర్వాత పక్కా ఎమోషనల్ కంటెంట్‌తో ఆయన ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా చూసిన కొందరు ఇన్సైడర్స్, సెన్సార్ సభ్యులు రష్మిక నటనకు ఫిదా అయ్యారని టాక్. ఈ పెర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డ్ రావడం గ్యారంటీ అని ప్రచారం జరుగుతుండగా, ఇది కేవలం సినిమాపై హైప్ పెంచేందుకు చేస్తున్న పీఆర్ స్టంట్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు.
ఈ రొమాంటిక్ డ్రామాలో రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటించాడు. గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న, ఇతర దక్షిణాది భాషల్లో నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
