భారత్, పాకిస్థాన్ మధ్య ఎప్పుడూ ఘర్షణ వాతావరణమే ఉంటుంది. కారణాలు ఏమైనా కావొచ్చు.. పరిస్థితులు అయితే గత కొన్నేళ్లుగా అలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ ఎఫెక్ట్ క్రీడల మీద కూడా పడింది. మన దేశంలో పాకిస్థాన్ జట్టుతో క్రికెట్ ఆడటానికి ఒప్పుకోం. ఐసీపీ ఈవెంట్లలో మాత్రమే ఆడుతుంటారు. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అనుకుంటున్నారా? క్రికెట్ వద్దు అనే వాళ్లు.. ఇప్పుడు అక్కడి సినిమాను ఓకే చేస్తారా అని.
ఎందుకంటే పాకిస్థాన్‌లో తెరకెక్కిన ఓ సినిమా ఇప్పుడు మన దేశానికి వస్తోంది కాబట్టి. అందులోనూ పదేళ్ల తర్వాత అక్కడి సినిమా మన దగ్గరకు వస్తోంది. పాకిస్థాన్ నటులు కూడా ఇటీవల కాలంలో మన సినిమాల్లో నటించడం లేదు. నటించే అవకాశమూ ఇవ్వడం లేదు. దీనిని అనధికారిక నిషేధం అని చెప్పొచ్చు. అయితే ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ సినిమాను మన దేశంలోకి తీసుకొస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం పాక్‌లో విడుదల అయి భారీ విజయాన్ని అందుకున్న ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ అనే సినిమాను ఇప్పుడు తీసుకొస్తున్నారు.
గతంలో వచ్చిన పాకిస్థానీ క్లాసిక్ సినిమా ‘మౌలా జట్’కు రీమేక్ ఇది. ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ జంటగా నటించిన ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ (The Legend of Maula Jatt) సినిమా అక్టోబర్ 13, 2022న పాకిస్థాన్‌తోపాటు కొన్ని ఇతర దేశాల్లోనూ విడుదలైంది. ఇప్పుడు అక్టోబర్ 2న భారత్‌తో పంజాబ్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలై రెండేళ్లు అవుతున్నా ఇంకా పాక్‌లో వీకెండ్స్‌లో వేస్తుండటం గమనార్హం.
సినిమా (The Legend of Maula Jatt) కథ విషయంలో నమ్మకం కారణంగానే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది అని టీమ్ నమ్ముతోంది. ఇప్పటికే సుమారు రూ.500 కోట్ల వసూళ్లు అందుకున్న ఈ సినిమా మన దగ్గర ఎలా ఆదరిస్తారో చూడాలి. ఎందుకంటే ఆ దేశంతో మన దేశంలో క్రికెట్ వద్దనే మనవాళ్లు.. ఆ దేశం సినిమాను (The Legend of Maula Jatt) చూస్తారా? అని.