బిగ్‌బాస్ 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓటిటి సీజన్ కూడా మొదలైంది. ఈసారి పాత కంటెస్టంట్లతో పాటు కొత్త కంటెస్టెంట్ లు కూడా ఉండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి.హౌస్ సెట్ మారింది… డిజైన్ కూడా ఛేంజ్ అయింది. అయితే హోస్ట్ మారలేదు. ‘బిగ్‌బాస్’ కి అత్యంత ముఖ్యమైన వాయిస్ ఇచ్చే వ్యక్తి కూడా మారలేదు. బిగ్‌బాస్ షోలో ఆకట్టుకునే అతి ముఖ్యమైన అంశాల్లో బిగ్‌బాస్ వాయిస్ ను అందరూ ప్రధానంగా చెప్పుకుంటారు.
బిగ్‌బాస్ ఎవరో ఎవరికీ తెలియదు. కేవలం వాయిస్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. గంభీరంగా ఉండే ఆ స్వరం కొన్ని సార్లు గగుర్పాటుకు కూడా గురి చేస్తుంటుంది. ‘బిగ్‌బాస్ కోరిక మేరకు…’ అంటూ వచ్చే ఆ వాయిస్ మీకూ నచ్చే ఉంటుంది. మరి ఆ వాయిస్ ఎవరిది? దానికి సమాధానం మేం చెబుతున్నాం.బిగ్‌బాస్ సీజన్ మొదలైనప్పటి నుండీ వాయిస్ ఓవర్ ఇస్తూ వస్తోంది ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. వివిద సినిమాలు, సీరియల్స్, ప్రకటనలకు డబ్బింగ్ చెప్పిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ ‘వాయిస్ బిగ్‌బాస్’ అని చాలా మందికి తెలిసుండదు.
5 సీజన్లుగా ఆయన వాయిస్‌లోనే మనం బిగ్‌బాస్ చూస్తున్నాం. తొలి సీజన్ మొదలయ్యే ముందు షో నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించారు. ఆఖరికి రాధాకృష్ణ గొంతు సరిపోతుందనే నిర్ణయానికి వచ్చారు. బిగ్‌బాస్ అంటూ రాధాకృష్ణ మాట్లాడే మాటల్లో కనిపించే గాంభీర్యం బాగా నచ్చి అతనిని ఎంపిక చేసుకున్నారు.