ఎప్పుడో 1993లోన్ దాదాపు 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో జపనీస్ బృందం తెరకెక్కించిన ఇండియన్ సినిమా “రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ”. అప్పట్లో సీరియల్ లా టీవీలో ప్రసారమైన ఈ ధారావాహికకు భీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉండేది, అందరూ ఆదివారం వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేసేవారు. మన భారతీయ దర్శకులు ఎంతమంది రామాయణాన్ని (Ramayana) తెరకెక్కించినప్పటికీ.. జపనీస్ వెర్షన్ కు ఒక రెస్పెక్ట్ ఉండేది. యానిమేషన్ వెర్షన్ లో దీన్ని బీట్ చేసే స్థాయి రామాయణం మరొకటి లేదు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.
దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆ యానిమేటెడ్ వెర్షన్ ను సినిమాగా (Ramayana) కట్ చేసి థియేటర్లలో విడుదల చేశారు. ఎవరు చూస్తారులే అనుకుంటే.. అన్నీ భాషల్లోనూ ఈ చిత్రం థియేటర్లలో హల్ చల్ చేస్తుండడం అనేది చర్చనీయాంశంగా మారింది. తమిళంలో 12 ఏళ్ల తర్వాత విడుదలైన “మదగజరాజా” తరహాలోనే ఈ “రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ” చిత్రం కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుండడం, ముఖ్యంగా పెద్దలు మరియు 90’s కిడ్స్ అందరూ ఈ సినిమా చూడడానికి ఆసక్తిచూపుతుండడం గమనార్హం.
అయితే.. ఈ రామాయణ హిందీ వెర్షన్ చాలా పాపులర్, కానీ అప్పటి వెర్షన్ ప్రింట్ మిస్ అవ్వడంతో.. కొత్తవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. అందువల్ల.. 1990 కాలంలో ఈ సిరీస్ చూసినవాళ్లు చిన్నపాటి వెలితిగా ఫీల్ అవుతున్నారు. ఇకపోతే.. చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో విడుదలైన ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసి మరిన్ని స్క్రీన్స్ పెంచే ఆలోచనలో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్.