‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ మహా.. తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ ను అందుకున్నారు. దీని తర్వాత ‘మహేషింతే ప్రతీకారం’ రీమేక్ గా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాన్ని రూపొందించారు.2020 లాక్ డౌన్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. అయితే తర్వాత వెంకటేష్ మహా దర్శకుడిగా చేసిన సినిమాలు రాలేదు. నటుడిగా మాత్రం వరుస సినిమాల్లో అలాగే వెబ్ సిరీస్లలో కనిపిస్తున్నారు.
అయితే రెండేళ్ల క్రితం వెంకటేష్ మహా మూడో చిత్రంగా ‘మర్మాణువు’ అనే చిత్రం రాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఈ చిత్రంలో హీరో అని కూడా ప్రకటన వచ్చింది. కాకపోతే ఎందుకో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. దీనికి కారణాలు ఏంటా అని ఆరా దీసే క్రమంలో.. రాజశేఖర్ కి వెంకటేష్ మహాకి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చినట్టు టాక్ వినిపించింది. మరోపక్క ‘మర్మాణువు’ మూవీ కోసం క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ చేస్తున్నట్లు వెంకటేష్ మహా తన ఇన్స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చాడు.
‘మూడేళ్లుగా ఈ సినిమాని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నానని, సాంప్రదాయ పద్ధతిలో ఈ సినిమాని తీయలేనని, అందుకే ‘క్రౌడ్ ఫండింగ్’ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన రాసుకొచ్చాడు. తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించాడు వెంకటేష్ మహా. తాను క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా మారి ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. అక్టోబర్ 27 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తమిళంలో రూపొందిన మండేలాకు రీమేక్.
ఈ సినిమా ప్రమోషన్స్ లో (Rajasekhar) రాజశేఖర్ తో చేయాల్సిన ‘మర్మాణువు’ ప్రాజెక్టు పై వెంకటేష్ మహా స్పందించాడు. ఇదొక డార్క్ కామెడీ సైకలాజికల్ డ్రామా అని, దీనికి 6.5 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అవుతుందని! ఈ ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేను అని.. చాలా మంది రిజెక్ట్ చేసినా.. నాకు నచ్చినట్టుగానే ఈ కథని ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అతి త్వరలో ఈ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్తానని కూడా ఇతను తెలిపాడు.