బుల్లితెరపై ఈ ఛానల్, ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఛానెళ్లలో షోలు చేసి యాంకర్ గా సుమ కనకాల గుర్తింపు తెచ్చుకున్నారు. యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి చాలా సంవత్సరాలే అయినా సుమకు యాంకరింగ్ ఛాన్స్ లు తగ్గడం లేదు. సుమతో పాటు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన చాలామంది యాంకర్లు బుల్లితెరకు దూరమైనా సుమ టీవీ షోలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా అరసవెల్లి ఆదిత్యుడి ఆలయానికి వెళ్లిన సుమ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 1991 సంవత్సరం నుంచి సినిమా, టీవీ రంగాల్లో తన కెరీర్ ప్రారంభమైందని మొదట్లో దూరదర్శన్ లో ఆ తరువాత జెమినీ ఛానెల్ లో తనకు అవకాశాలు వచ్చాయని సుమ తెలిపారు. ఆ సమయంలో ప్రేక్షకుల్లో సీరియళ్లపై కూడా క్రేజ్ పెరిగిందని సుమ కనకాల పేర్కొన్నారు. తెలుగు భాషను అనర్గళంగా నేర్చుకున్నానని అందువల్లే సినిమా ఫంక్షన్లను యాంకరింగ్ అవకాశాలు వస్తున్నాయని సుమ పేర్కొన్నారు. 1994 సంవత్సరంలో ఒక సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో తనను రాజీవ్ కనకాల తొలిసారి చూశారని సుమ వెల్లడించారు.
యాంకర్ గా చేయడానికి ముందు తాను సీరియళ్లు, సినిమాలలో చేశానని అయితే భర్త రాజీవ్ కనకాలకు తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని సుమ నవ్వుతూ చెప్పారు. ఆ కారణం వల్లే తాను యాంకరింగ్ ను నమ్ముకున్నానని సుమ పేర్కొన్నారు. అమ్మకు సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని.. తన యాంకరింగ్ కెరీర్ కు ఆ సెన్సాఫ్ హ్యూమర్ ఉపయోగపడిందని సుమ తెలిపారు. తనకు యాంకరింగ్ పరంగా అమ్మే గురువు అని సుమ వెల్లడించారు. చాలారోజుల నుంచి ఈ ఆలయానికి రావాలని అనుకుంటున్నానని ఇప్పటికీ కుదిరిందని సుమ చెప్పారు.