తెలుగు సినిమా పరిశ్రమలో వాయిస్ ఉన్న నటీమణుల్లో జీవిత (Jeevitha) ఒకరు. అదేంటి మిగిలిన వాళ్లు మాట్లాడరా, వాళ్లకు వాయిస్ లేదా అంటారా? అయితే ఇక్కడ వాయిస్ అంటే… ఇండస్ట్రీలో ఏమైనా జరిగితే ప్రశ్నించే తత్వం ఉన్నమనిషి అని అర్థం. ఇప్పటివరకు ఆమె రెయిజ్ చేసిన పాయింట్లు, చర్చకు తీసుకొచ్చిన అంశాలు, చేసిన నిరసనలు చాలానే ఉన్నాయి. పెద్దలు ఎంతమంది ఉన్నా… ఆమె తన రేంజిలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఆమె ‘మాట’ వినిపించడం తగ్గింది. అదెందుకు అనే విషయం ఆమెనే చెప్పారు.
తెలుగులో తనదైన ముద్ర వేసిన అచ్చ తెలుగు హీరోయిన్లలో జీవిత ఒకరు. 80వ దశకంలో ఆమె సినిమాలు, పాత్రలు చూస్తే సగటు హీరోయిన్ అనే ముద్ర అస్సలు ఉండదు. స్టార్ హీరోలతో నటించి, ఇంకాస్త పెద్ద హీరోయిన్ అవుతారేమో అనుకుంటున్న సమయంలో… రాజశేఖర్‌ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత నటనకు దూరం అయినా, ప్రొడక్షన్, డైరెక్షన్లో భాగమయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలతోపాటు, రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు.
అయితే, ఆమె మాటలే ఒక్కోసారి ఆమెను ఇబ్బంది పెట్టేవి. ఈ క్రమంలో జీవిత చుట్టూ కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకు చుట్టుకుని జైలు శిక్ష వరకు పరిస్థితి వెళ్లింది. అయితే ఇటీవల కాలంలో పెద్దగా బయట ఎక్కడా మాట్లాడటం లేదు. అయితే తాను ఉద్దేశపూర్వకంగానే దేని గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తున్నట్లు జీవిత చెప్పారు. తన కూతుళ్ల కెరీర్ కోసమే ఇలా చేస్తున్నట్లు జీవిత చెప్పారు. తాను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు దాటిందని, ఎన్నో ఒడుదొడుకులను దాటి ఒక స్థాయికి చేరుకున్నానని చెప్పారు.
తాను ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తానని, అది అందరికీ నచ్చదని, అందుకే ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని జీవిత క్లారిటీ ఇచ్చారు. నా పిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చారు. నేనేదైనా మాట్లాడి వివాదాస్పదం అయితే అది వాళ్ల కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. నా కారణంగా వాళ్లు ఇబ్బంది పడకూడదు. నేనే కాదు, మా ఆయన కూడా అందుకే మౌనంగా ఉన్నారు అని జీవిత చెప్పారు. అయితే ఇది భయం కాదు అని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు ఇలా ఉండటం వల్ల తాము హాయిగా ఉన్నాం అని కూడా చెప్పారు. జీవిత (Jeevitha Rajasekhar) చాలా ఏళ్ల తర్వాత ఇటీవలే రజినీకాంత్‌తో ‘లాల్ సలామ్’ సినిమా చేశారు.