టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కంటెంట్ అద్భుతంగా ఉన్న సినిమాలు మాత్రమే సక్సెస్ సాధిస్తున్నాయి. ఈ నెలలో సక్సెస్ సాధించిన సినిమాలైన బింబిసార, సీతారామం, కార్తికేయ2 కథ, కథనం అద్భుతంగా ఉండటం వల్లే ప్రేక్షకుల అంచనాలను మించి విజయం సాధించాయి. అయితే లైగర్ సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఈ సినిమా రిజల్ట్ విజయ్ దేవరకొండ కెరీర్ పైనే ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయి.
కథ, కథనం ఆకట్టుకునేలా లేకపోవడం పూరీ జగన్నాథ్ కెరీర్ కు మైనస్ అవుతోందని చెప్పవచ్చు. ఇతర రచయితల సహాయం తీసుకోకుండా పూరీ జగన్నాథ్ సొంతంగా తయారు చేస్తున్న స్క్రిప్ట్ లు రొటీన్ గా ఉంటున్నాయి. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో సాధారణ ప్రేక్షకులు సైతం పూరీ జగన్నాథ్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరీ జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ లో వచ్చాడని అనుకునేలోపు లైగర్ తో పూరీ ఫ్యాన్స్ కు భారీ షాకిచ్చారు.
యంగ్ జనరేషన్ డైరెక్టర్లు కొత్తదనం ఉన్న కథలతో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలను పొందుతుంటే పూరీ జగన్నాథ్ మాత్రం పాతకాలం నాటి కథలను తెరకెక్కించి ఇతరులు విమర్శించే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. 15 సంవత్సరాల క్రితమే అడ్వాన్స్డ్ కథలను తెరకెక్కించిన పూరీజగన్నాథ్ ప్రస్తుతం రొటీన్ కథలను తెరకెక్కించి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలపై పూరీ జగన్నాథ్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పూరీ జగన్నాథ్ అభిమానులను సైతం నిరాశపరిచే విధంగా ఈ సినిమా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ లో ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా విడుదల కానుండగా బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి సైతం ఈ సినిమాకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పూరీ జగన్నాథ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.