భారతదేశంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), పాన్ ఇండియా ఫేమ్‌ను సంపాదించిన ప్రభాస్ (Prabhas), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వంటి గొప్ప పేర్లు ఉన్నా, వాళ్లందరిని మించి సంపద కలిగిన వ్యక్తిగా ఒక సంగీత దర్శకుడు నిలిచారు. ఆయన మరెవరో కాదు.. మ్యూజిక్ మాజిషియన్ ఏఆర్ రెహమాన్ (A.R.Rahman). సినిమాల దృష్టికోణంలో కన్నా బయట ప్రపంచంలో ఆయన జీవన శైలి, సంపద స్థాయి మిగిలిన స్టార్స్ కంటే చాలా ముందుంది. చాలా మంది హీరోల కంటే రెహమాన్ సంపాదన ఎక్కువగా ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.
హడావుడి లేకుండా జీవించేందుకు ఇష్టపడే రెహమాన్ (A.R.Rahman) , తన జీవితాన్ని అత్యంత విలాసవంతంగా లీడ్ చేస్తున్నా, అంతగా ఆర్భాటం చేయడు. చెన్నైలోని కోడంబాక్కంలోని ఆయన ఇంటి విలువ సుమారు రూ. 20 కోట్లు. అంతే కాకుండా లాస్ ఏంజెల్స్‌లో రూ. 25 కోట్ల విలువైన సొంత ప్రాపర్టీ కూడా ఉంది. ఇది కేవలం నివాసం మాత్రమే కాకుండా, స్టూడియోగా కూడా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పని చేసే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈ సౌకర్యాలు ఆయనకు అవసరమే.
సంగీత దర్శకుడిగా రెహమాన్ (A.R.Rahman) ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇప్పటివరకు ఆయన 150 పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ఇప్పటి అంచనాల ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 1,728 కోట్లు. ఈ స్థాయిలో సంపదను సంపాదించినప్పటికీ రెహమాన్ మాత్రం ఎప్పుడూ తన మూలాల్ని మరిచిపోలేదు. ఒకప్పుడు స్కూల్‌కు వెళ్లలేకపోయిన బాలుడు, ఇప్పుడు ఖండాంతరాల్లో స్టూడియోలు కలిగిన సంగీత శిల్పిగా నిలిచాడు. ప్రముఖమైన పంచతన్ రికార్డ్స్‌తో ప్రారంభించిన ఆయన ప్రయాణం, తర్వాత ఏఎం స్టూడియోస్ స్థాపన వరకూ సాగింది.
దుబాయ్‌లో ఫిర్దౌస్ స్టూడియోకు సహ వ్యవస్థాపకుడిగా మారారు. లండన్‌లో ఎలైట్ కేఎం మ్యూజిక్ స్టూడియో కూడా ఆయనదే. అంతేకాదు, కార్లపై ఉన్న అభిమానం కూడా రెహమాన్ స్టేటస్‌ను సూచించే అంశం. మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్షే టేకన్ ఈవీ, వోల్వో, జాగ్వార్ లాంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి. వీటి విలువ సుమారు 8 కోట్లు. కేవలం సంగీతానికే కాదు, జీవన శైలిలోనూ రెహమాన్ ఒక స్టైల్ ఐకాన్. దేశవ్యాప్తంగా పేరు పొందిన స్టార్ హీరోలకంటే ఆయన ఆస్తి ఎక్కువగా ఉండటం, ఆయన ప్రతిభకు నిలువు నిదర్శనం.