లియో (LEO) తర్వాత మళ్లీ మాస్‌గానే వచ్చేందుకు సిద్ధమవుతున్న లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj), ఈసారి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో (Rajinikanth) కలిసి కూలీ (Coolie) పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ఆగస్ట్ 14న విడుదల చేయాలన్న నిర్ణయం ముందే తీసుకున్నారు. కానీ ఇప్పుడు అదే రోజున హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్‌లో రూపొందుతోన్న వార్ 2 (War 2) కూడా రిలీజవుతుండటంతో ఊహించని పోటీ ఏర్పడింది.
దీంతో రజినీ అభిమానుల్లో అసలు కూలీ ఆ తేదీనే వస్తుందా? లేదా? అనే సందేహం మొదలైంది. ఎందుకంటే కూలీ సినిమా గురించి మేకర్స్ నుంచి పెద్దగా అధికారిక సమాచారం లేకపోవడం కూడా ఈ అనుమానాలకు కారణమవుతోంది. సమ్మర్‌లో రిలీజ్ చేయాలన్న ఆరంభ అంచనాల నుంచి సినిమా ఆగస్ట్‌కు మారినప్పటికీ, అప్పటి నుంచి ప్రమోషనల్ అప్డేట్లు లేకపోవడం అభిమానులను కాస్త అసహనానికి గురిచేస్తోంది. కానీ లోకేష్ గత సినిమాల కంటే ఈ సినిమాలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడనే టాక్ పరిశ్రమలో వినిపిస్తోంది.
ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర పాత్రలు కూడా కీలకంగా ఉండడంతో, ఇది మల్టీ స్టారర్ యాంగిల్‌ను బలపరుస్తోంది. ఇక మరోవైపు వార్ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. యష్ రాజ్ ఫిలింస్ యాక్షన్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. టెక్నికల్‌గా కూడా హై బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే ఫిక్స్ కావడంతో, అదే రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్ తప్పదు.
అయితే రెండు సినిమాల జోనర్ వేరు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్ 14న వస్తే, బాక్సాఫీస్ వద్ద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ యుద్ధం జరుగనుంది. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర (Upendra).. మరోవైపు ఎన్టీఆర్, హృతిక్. ఈ పోటీ ప్రేక్షకులకు పండగే అవుతుంది. అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు కూడా భారీ స్కేల్‌లో తెరకెక్కుతున్నాయి. అయితే ఇక జులైలోనైనా కూలీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.