సీనియర్ నిర్మాత అంటే.. కేవలం వయసు, తీసిన సినిమాల సంఖ్య మాత్రమే కాదు.. అప్పటివరకు తీసిన సినిమాలు ఇచ్చిన అనుభం కూడా ఉంటుంది. ఆ అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలు కూడా ఉంటాయి. వాటి ఆధారంగా ఏ సినిమా ఎలా ఉంటుంది? ఎలా ఆడుతుంది? ఏం చేయాలి? ఎక్కడ వెనక్కి తగ్గాలి అనే లెక్కలు కూడా వచ్చేస్తాయి. అలా టాలీవుడ్‌లో ఇద్దరు అగ్ర నిర్మాతలు ముందగా ఊహించేసి తమ సినిమాలను సైలెంట్ జనాల్లోకి వదిలారు అంటున్నారు.
ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన ‘గౌరవం’, ఇప్పుడు వచ్చిన ‘అహింస’ సినిమాలను కలిపి ఓ కథ అల్లేస్తున్నారు నెటిజన్లు. ఈ రెండు సినిమాల కామన్ పాయింట్లు చూస్తే.. ఈ రెండూ పెద్ద నిర్మాణ సంస్థల్లోనే తెరకెక్కాయి. ఈ రెండింటిలో ఆయా నిర్మాణ సంస్థల తనయులే నటించారు. అంటే వారికిదే తొలి సినిమా. ఇంకో కంపారిజన్ ఏంటంటే.. ఈ సినిమాలను ఆయా నిర్మాతలు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఆ మేరకు ప్రచారం కూడా పెద్దగా చేసింది లేదు.
అల్లు శిరీష్ హీరోగా 2013లో ‘గౌరవం’ సినిమా తెరకెక్కించింది. దగ్గుబాటి అభిరామ్ హీరోగా 2023లో ‘అహింస’ వచ్చింది. ఈ రెండు సినిమాల విషయంలో పెద్దగా ప్రచారం లేదు. నిర్మాతలు సీరియస్‌గా కనిపించలేదు కూడా. దీంతో సినిమాల ఫలితాల్ని ముందుగా ఊహించే వాళ్లు అలా వెనక్కి తగ్గారని అంటున్నారు. లేకపోతే ఎందుకు కొడుకుల సినిమాలు ప్రచారం చేయకుండా ఉన్నారు అని అంటున్నారు నెటిజన్లు.
మామూలుగా ఓ పెద్ద కుటుంబం నుండి ఓ యువ కథానాయకుడు అరంగేట్రం చేస్తున్నాడంటే హంగామానే వేరు. కానీ ‘గౌరవం’, ‘అహింస’ (Ahimsa) విషయంలో ఇదేమీ జరగలేదు. నిర్మాత సురేష్ బాబు తీరు చూస్తుంటే.. ‘అహింస’ సినిమా జనాల దృష్టిలో పడకుండా వెళ్లిపోతే బాగుండు అనుకున్నట్లు ఉంది అని నెటిజన్లు అంటున్నారు. గతంలో అల్లు అరవింద్ కూడా ఇలానే చేశారు అని తేల్చి పారేస్తున్నారు. ఇందులో నిజానిజాల సంగతి ఆయా నిర్మాతలకే ఎరుగు.