జమున అనగానే మనకు చాలా సినిమాలు గుర్తొస్తాయి. అందులో ప్రముఖంగా గుర్తొచ్చే సినిమా ‘మూగ మనసులు’. ఆ సినిమాలో అల్లరిపిల్లగా జమున చేసిన సందడి మామూలుగా ఉండదు. సినిమా మొదలు నుండి ఆఖరి వరకు ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తారు జమున. ఆ రోజుల్లో ఆ పాత్ర జమున కోసమే రాసినట్లుంది అని అన్నారట సినిమా చూసినవాళ్లు. అయితే ఆమెకు ఆ సినిమా ఏమంత ఈజీగా రాలేదు. ఎన్నో మార్పులు, చేర్పులు, చర్చలు, రచ్చలు తర్వాత ఆ సినిమాలోకి జమున వచ్చారు.
ఓ సందర్భంలో జమున ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ‘మూగ మనసులు’ సినిమా ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు అనేవారు జమున. ఆ పాత్ర తనకు మరపురాని అనుభూతులు కలిగించింది అనేవారు. సినిమా అనుకుంటున్న తొలి రోజుల్లో జమున పోషించిన గౌరి పాత్ర గురించి ఇండస్ట్రీలో ఎన్నో చర్చలు జరిగాయట. ఈ పాత్రను నేను వేస్తా అంటే నేను వేస్తానని ఎంతోమంది కథానాయికలు ముందుకు వచ్చారట. అయితే దర్శకుడు సుబ్బారావు, కథానాయకుడు నాగేశ్వరరావు మాత్రం ఆ పాత్రకి జమున అయితేనే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారట.
దీంతో ‘మూగమనసులు’ సినిమాలో జమునను బుక్ చేస్తే ఆ పల్లెటూరి యాస మాట్లాడుతుందా అనే డౌట్ తీసుకొచ్చారట. అయితే ఈ విషయంలో సినిమా బృందం చాలా నమ్మకంగా ఉందట. అందుకు తగ్గట్టుగానే తాను కూడా నటించాను అని జమున వెల్లడించారు. అయితే నటించినప్పుడు నిజంగానే సవాలు ఎదురైందట జమునకు. ‘అయ్య బాబోయ్.. కొబ్బరి చెట్టు మీద తెల్ల కాకి.. ఏది మామ వద్దొద్దు.. వీపు ఎకరన్నార ఉంది’
ఇలాంటి మాటల్ని ఒకరకమైన యాసలో మాట్లాడటం ఇబ్బందిగా అనిపించింది అని జమున చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో మహా నటి సావిత్రి, అక్కినేని ఉన్నప్పటికీ కూడా జమునకు పేరొచ్చిందంటే ఎంత గొప్పగా నటించారో అర్థం చేసుకోవచ్చు. గౌరి అనే పేరు ఆ రోజుల్లో వినిపిస్తే జమున ముఖం ఠక్కున గుర్తొచ్చేదట.