సినిమా పరిశ్రమలో జరిగే అన్ని ఊహించని మార్పులు ఇంకేరంగంలోనూ జరగవంటే నమ్మబుద్ది కాదు కానీ ఇది నిజంగానే నిజం.. ముందుగా ఓ హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలనుకుని.. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగానే.. అధికారికంగా ప్రకటించి.. ఆ తర్వాత పలు కారణాల వల్ల ప్రాజెక్టులు నిలిపేయడం.. లేదా కొంత భాగం చిత్రీకరించిన తర్వాత అప్పటికే కోట్లలో నష్టపోవడం వల్ల ఇంక నా వల్ల కాదు బాబోయ్ అని నిర్మాత చేతులెత్తెయ్యడం కామనే..
అలా మెగా బ్రదర్ నాగేంద్ర బాబు నటించిన సినిమాలు కూడా కొన్ని ఆగిపోయాయి..మెగాస్టార్ చిరంజీవి నటించిన కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన నాగబాబు హీరోగా.. ప్రముఖ రచయిత జి. సత్యమూర్తి (సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్) దర్శకత్వంలో ‘భూలోక వీరుడు – అంతరిక్ష బాలుడు’ అనే అడ్వంచరస్ మూవీ ప్లాన్ చేశారు.. శుభ ప్రియ క్రియేషన్స్ బ్యానర్ మీద డి. రామరాజు నిర్మాతగా తెరకెక్కించబోయే ఈ మూవీలో రూపిణి, శుభలేఖ సుధాకర్, శ్రీహరి, కెప్టెన్ రాజు కీలకపాత్రధారులు..
అంతరిక్షం నుండి వచ్చిన ఓ బాలుడు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మధ్య ఏర్పడిన స్నేహం ఆధారంగా వినోదమే ప్రధానంగా కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించనున్న ఈ చిత్రాన్ని విశాఖపట్నం, అరకు ప్రాంతాల్లో నెల రోజుల్లో ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలనుకున్నారు.. అంతరిక్ష బాలుడిగా బొంబాయికి చెందిన సుమిత్, పోలీస్ అధికారిగా నాగబాబు కనిపించనున్నారు.. ఇందులో ఉండే మూడు పాటలను వేటూరి రాస్తున్నారని.. దేవేంద్రన్ సంగీతమందిస్తున్నారని.. ఇతర భారీ సాంకేతిక నిపుణులు వివరాలను కూడా వెల్లడించారు..
వాల్తేరు అప్‌ల్యాండ్స్‌లో గల ఓ గెస్ట్ హౌస్‌లో వేసిన పోలీస్ స్టేషన్ సెట్‌లో నాగబాబు, హీరోయిన్ రూపిణి చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్తుండగా శుభలేఖ సుధాకర్ ఆశ్చర్యపోతూ చూస్తుండడాన్ని దర్శకుడు సత్యమూర్తి తొలి షాట్‌గా చిత్రీకరించారు.. తర్వాత పలు కారణాల వల్ల ‘భూలోక వీరుడు – అంతరిక్ష బాలుడు’ అర్థాంతరంగా ఆగిపోయింది.. అయితే అంతకుముందు ఈ కాంబోలో ట్రైన్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ కథతో ‘సూపర్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమా వచ్చింది కానీ ఆడలేదు..