ఒకప్పటిలా ఇప్పుడు సినిమాలు అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ అవ్వడం లేదు. ఏదో ఒక విధంగా సమస్యలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమాల బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. ఇది పక్కన పెడితే.. సినిమాకి థియేటర్ తర్వాత మేజర్ బిజినెస్ జరిగేది ఎక్కడ అంటే అది.. ఓటీటీ అనే చెప్పాలి. చిన్న సినిమాలకు అయితే ఓటీటీ (OTT) బిజినెస్ చాలా ముఖ్యం.టాక్ బాగున్నా థియేటర్లలో అవి ఎక్కువగా కలెక్ట్ చేసే అవకాశాలు లేవు. అయితే ఓటీటీ వాటికి మంచి రేటు ఇస్తుంది. ఇలా ఓటీటీల రాజ్యం గట్టిగానే పెరిగింది.
దీంతో శాటిలైట్ అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు శాటిలైట్ వాళ్లకి కూడా సినిమాను ముందుగా చూపించే వారు. నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి రైట్స్ బుక్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. థియేటర్లలో హిట్ అయిన పెద్ద సినిమాలకి కూడా శాటిలైట్ బిజినెస్ జరగడం లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది.
ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 4,5 వారాల్లో ఓటీటీకి (OTT) వస్తుంది. ఆ 5 వారాల గ్యాప్ తో రిలీజ్ డేట్ డిసైడ్ చేసేది కూడా ఓటీటీ సంస్థలే. మరి 5 రోజులకే సినిమా ఓటీటీకి వచ్చేస్తే.. ఆ తర్వాత ఎప్పటికో టీవీల్లో టెలికాస్ట్ చేస్తే ఆడియన్స్ కి ఆ సినిమా ఆసక్తి ఎక్కడ ఉంటుంది. శాటిలైట్ వారికి మంచి టీఆర్పీ వచ్చేది గ్రామాల్లో నుండే. అక్కడ మాత్రమే ఇంకా డిష్..లు వంటివి వాడుతున్నారు. సిటీల్లో అంతా వైఫై సర్వీసు వాడుతున్నాం కదా అని ఓటీటీ కనెక్షన్లు మాత్రమే తీసుకుంటున్నారు చాలా మంది.
అందుకే శాటిలైట్ రీచ్ తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల శాటిలైట్ నిర్వాహకులు కొంతమంది నిర్మాతలతో భేటీ అయ్యి.. ఓటీటీలకు ఇచ్చే టైంలోనే టీవీల్లో కూడా టెలికాస్ట్ చేసుకునేలా అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. కుదరని పక్షంలో ఓటీటీల్లోకి వచ్చిన రెండు, మూడు రోజులకి అంటే వీకెండ్ కి టీవీల్లో టెలికాస్ట్ చేసుకునే విధంగా అగ్రిమెంట్లు చేయాలనీ, అప్పుడే నిర్మాతలు కోట్ చేసిన రేట్లకి తగ్గట్టు బిజినెస్ చేసుకుంటామని వారు చెప్పినట్టు వినికిడి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.