సినిమా టికెట్ కంటే… థియేటర్లలో ఇంటర్వెల్‌లో కొనే స్నాక్స్ ధరే ఎక్కువ అంటూ అంటుంటారు. మీరు కూడా అలాంటి ఇబ్బందే పడి ఉంటారు. గంటన్నర సినిమా చూశాం.. ఏదో ఒకటి తిందాం అంటే జేబు చిల్లు పక్కా. ఎందుకంటే బయట 40 రూపాయలకు దొరికే సాఫ్ట్ డ్రింక్ అక్కడ 100 ఉండొచ్చు. 20 రూపాయల పాప్‌కార్న్ 200 రూపాయలు ఉండొచ్చు. దీంతో తప్పక కొని తింటుంటారు. అయితే ఎక్కడో చిన్న ఆశ.. వీటిపై కోర్టులు ఎప్పటికైనా తీర్పునిస్తాయి. ఇంటి నుండో, బయట నుండో కొనుక్కుని లోపల కూర్చుని తినొచ్చు అని. కానీ ఆ ఆశ కూడా పోయింది. బయట ఫుడ్‌కి థియేటర్ల వాళ్లు ఇక గేట్లు వేసేసినట్లు. అది కూడా అధికారికంగా.
ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తమకు ఇష్టం వచ్చిన తినుబండారాలు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే కొన్ని థియేటర్లు దీనిని అనుమతించడం లేదు అనుకోండి. అయితే థియేటర్ల యాజామాన్యాల బయటి ఫుడ్ విషయంలో వేసిన ఓ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. థియేటర్లలోకి ప్రేక్షకులు బయటి తినుబండారాలను తీసుకెళ్లడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బయట ఫుడ్‌ను నియంత్రించే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని తీర్పు వెలువరించింది.
థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లేది వినోదం కోసమని.. అలాంటి చోట బయటి ఫుడ్ తీసుకెళ్తే నియంత్రించే అధికారం యాజమాన్యాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. థియేటర్ల లోపల తినుబండారాలు నచ్చకుంటే వాటిని కొనకుండా ఉండే అవకాశం ప్రేక్షకులకు ఉంది కదా అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే థియేటర్లలో శుభ్రమైన మంచి నీరు ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. దాంతోపాటు చిన్న పిల్లలకు అవసరమైన మేర తల్లిదండ్రులు ఆహారం తీసుకెళ్లేందుకు థియేటర్ల యాజమాన్యాలు అనుమతించాల్సిందే అని పేర్కొంది.
దీంతో ఇప్పటికే 20 రూపాయల వాటర్ బాటిల్‌ను రెండు, మూడింతలు చేసి అమ్ముతున్న థియేటర్ జనాలు నీళ్లు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వస్తాయా అనేది చూడాలి. ఇక ధరల సంగతి అంటారా? ఆ నియంత్రణ ఎప్పుడో పేపర్లకే పరిమితమైపోయింది. కాబట్టి.. థియేటర్లలో ఇంటర్వెల్ దోపిడీకి గేట్లు తీసేసినట్లే అంటున్నారు నెటిజన్లు.