సినిమా పేరు ప్రకటించడంలో, దాని కోసం టీజర్ రిలీజ్ చేయడంలో చాలా బజ్ క్రియేట్ చేయాలని చిత్రబృందం చూస్తూ ఉంటుంది. సినిమా పేరు ఏమై ఉంటుందబ్బా అని అభిమానులు ఎదురు చూస్తూ సోషల్ మీడియాలో సందడి చేసేలా చూస్తుంటుంది. అయితే దీనికి తూట్లు పొడుస్తూ కొంతమంది సినిమా టైటిల్‌ని లీక్ చేసేస్తుంటారు. ఎక్స్‌క్లూజివ్ అంటూ రాసేస్తుంటారు. దీని వెనుక తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతి నెలా చేసే ఓ పని కూడా కారణమని చెప్పొచ్చు. ఈ ఇబ్బందిని తప్పించడానికి ఛాంబర్ కొత్త నిర్ణయం తీసుకుందట.
ప్రతి నిర్మాణ సంస్థ తెలుగు ఫిలిం ఛాంబర్‌లో టైటిళ్లను రిజిస్టర్ చేయిస్తూ ఉంటుంది. తమ సంస్థలో నిర్మించబోయే సినిమాల పేర్లు వివరాలను ఛాంబర్‌కు ఇస్తుంది. వాటిని ప్రతి నెలా ఛాంబర్ ఓ లిస్ట్‌లా ఆ పేర్లు వెల్లడిస్తూ ఉంటుంది. దీంతో ఒక్కో ప్రొడక్షన్ హౌస్‌లో వచ్చే సినిమాల పేర్లు బయటికొచ్చేస్తున్నాయి. ఆ పేర్లు బట్టి అది ఏ హీరో సినిమానే అభిమానులు సులభంగా ఊహించేస్తున్నారు. దీంతో సినిమా పేర్లు ప్రకటించేసరికి ఆ ఉత్సుకత ఉండటం లేదు. దీంతో ఛాంబర్ నుండి ప్రతి నెలా జాబితా విడుదల ఆపేయాలని నిర్ణయించారట.
ఫిలిం ఛాంబర్ నుండి లిస్ట్ అయితే ఆపగలరు కానీ… పుకార్లు, లీక్‌లు అయితే ఆపలేరు కదా. సినిమా టీమ్‌లో ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు సినిమా పేరును లీక్ చేసిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు సినిమా పేరుకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకోవడానికి చిత్రబృందమే కావాలని లీక్ చేస్తుందని కూడా కొంతమంది అంటుంటారు. . మరి అలాంటివి ఆపగలుగుతారా అనే ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారో.