కల్పిత కథలు, పాత్రలతో తెరకెక్కించే సినిమాలను చూస్తున్నప్పుడు.. కొందరు ఆ పాత్రలలో తమను తాము ఊహించుకుంటారు. అంతేకాదు.. ఫలానా సన్నివేశాన్ని చూసినప్పుడు, సంభాషణలు వింటున్నప్పుడు ఎక్కడో ఎప్పుడో చూసిన జ్ఞాపకం వస్తుంది. ప్రస్తుత రోజుల్లో నిజ జీవిత గాథలనే బయోపిక్‌లుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వెళితే.. జ్యోతిష్యాన్ని కొందరు మూఢ నమ్మకమని కొట్టేస్తూ వుంటారు.’రాధే శ్యామ్’ మూవీ విషయంలో హీరో పెద్ద జ్యోతిష్యుడు. ఆ మూవీ పై బాబు గోగినేని వంటి హేతువాది ఎంత కక్ష్య కట్టాడో చెప్పనవసరం లేదు.
కానీ కొందరు జ్యోతిష్యులు చెప్పింది చెప్పినట్లు జరిగిన ఘటనలు కూడా కోకొల్లలు. ఇందుకు సీనియర్ నటి జయసుధ జీవితమే పెద్ద ఉదాహరణ. కృష్ణ సతీమణి విజయ నిర్మలకు.. జయసుధ మేనకోడలు అన్న సంగతి తెలిసిందే. యాధృచ్చికంగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సుజాత అలియాస్ జయసుధకు ఈ విషయాన్ని ఓ జ్యోతిష్యుడు ముందే చెప్పాడట. ఆ వివరాల్లోకి వెళితే.. ఆమె తండ్రి రమేష్.. ఓ సారి స్నేహితులతో కలిసి బెంగళూరు వెళ్లారట. అక్కడ ఓ వ్యక్తి జ్యోతిష్యం బాగా చెబుతారని.. ఏం చెప్పినా నూటికి నూరు శాతం జరుగుతుందని బెంగళూరులో చెప్పుకునేవారట.
ఈ విషయం తెలుసుకున్న రమేష్ స్నేహితులు ఆయనకు ఇష్టం లేకపోయినా సదరు జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లి చేయి చూపించుకున్నాడట. ఆయన చేయి చూసి ఏవేవో లెక్కలు వేసి మీ పెద్దమ్మాయి పెద్ద నటి అవుతుంది. పేరు ప్రఖ్యాతులు, ఆస్తులన్ని కూడా తెస్తుందని చెప్పాడట. అయితే అప్పటికే జయసుధకు సినిమాలంటే అసహ్యమని.. జ్యోతిష్యుడు అబద్ధం చెబుతున్నాడని రమేష్ నవ్వుకున్నారట. కానీ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశారట. ఇదిలావుండగానే.. పండంటి కాపురంలో చిన్న పాత్రకు అవసరం పడటంతో ఓ రోజున జయసుధను షూటింగ్‌కు తీసుకెళ్లారు విజయనిర్మల.
ఈ విషయం తెలుసుకున్న రమేష్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. మనకు సినిమాలెందుకు అని ప్రశ్నించాడ. కానీ పండంటి కాపురం చిత్రీకరణ దశలో వుండగానే ఆమె నటనను చూసిన పలువురు మేకర్స్ మరో రెండు సినిమాల్లో జయసుధకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆఫర్లు క్యూకట్టడంతో పాటు జయసుధ కూడా మనసు మార్చుకోవడంతో రమేశ్ కూతురి కోరికను కాదనలేకపోయారు. అంతేకాదు.. సుజాత పేరిట అప్పటికే మరో నటి ఇండస్ట్రీలో వుండటంతో సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డి సూచన మేరకు కూతురికి జయసుధ అని పేరు మార్చారు రమేశ్. ఆ తర్వాత సహజ నటిగా దక్షిణాదిలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించి జ్యోతిష్యుడి మాటను నిజం చేశారు జయసుధ.