మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంఖ్య కేవలం 900 అనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయని వార్తలు వచ్చాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఇప్పటికే పోటీ చేస్తానని ప్రకటన చేయడంతో పాటు ప్యానల్ ను కూడా ప్రకటించడం గమనార్హం. పూరీ జగన్నాథ్ ఆఫీస్ నుంచి ప్రకాశ్ రాజ్ వ్యూహాలను రచిస్తున్నారని తెలుస్తోంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ‘మా’ ఎన్నికలు ఇప్పట్లో జరగవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.
2001 నుంచి అమలవుతున్న తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఒక కార్యవర్గం ఎన్నికైన తరువాత గరిష్టంగా ఆరు సంవత్సరాల పాటు ఉండవచ్చని సమాచారం. ‘మా’ బై లాస్ లో కూడా ఎన్నికైన సంఘం రెండేళ్లకల్లా దిగిపోయి ఎన్నికలు జరిపించాలనే నిబంధన లేదు. అధ్యక్షుడు ఆరు సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉండేలా ‘మా’ బై లాస్ లో ఉంది. ఎన్నికలు జరిగితే కచ్చితంగా తానే విజయం సాధిస్తానని ప్రకాశ్ రాజ్ భావిస్తున్నారు.
అయితే ఇప్పట్లో ప్రకాష్ రాజ్ ఆశలు నెరవేరడం తేలిక కాదని తెలుస్తోంది. కొత్త కార్యవర్గం ఎన్నికయ్యే వరకు ప్రస్తుత కార్యవర్గానికి పూర్తిస్థాయి అధికారాలు ఉంటాయి. ప్రస్తుతం ‘మా’ కార్యవర్గం ఎన్నికలు వాయిదా వేయాలనే భావిస్తోందని తెలుస్తోంది. న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చూడాల్సి ఉంది. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని ప్రకటించిన వాళ్లకు ఎన్నికలు వాయిదా పడటం భారీ షాక్ అనే చెప్పాలి.