ఒక సినిమా విడుదలయ్యాక బోలెడు మంది క్రెడిట్ కోసం అర్రలు చాస్తుంటారు. కానీ సినిమాని హీరో & డైరెక్టర్ తర్వాత మోసేది మ్యూజిక్ డైరెక్టర్. ఒక్కోసారి సినిమాలోని కంటెంట్ కి మించిన ఎలివేషన్ ఇస్తుంటాడు మ్యూజిక్ డైరెక్టర్. ముఖ్యంగా గతవారం విడుదలైన “మిరాయ్, కిష్కింధపురి” చిత్రాల్లో బాగా ఎలివేట్ అయ్యింది నేపథ్య సంగీతం. రెండు సినిమాల్లోనూ బ్యాగ్రౌండ్ స్కోర్ అనేది చాలా హైలైట్ అయ్యింది.
“కిష్కింధపురి”కి చేతన్ భరద్వాజ్ ఇచ్చిన హారర్ థీమ్ బీజీయం సినిమాని భలే ఎలివేట్ చేసింది. ఇక “మిరాయ్” సినిమా విషయంలో గౌరి హరకి వస్తున్న అప్రిసియేషన్ మామూలుగా లేదు. మంచు మనోజ్ ఏకంగా సక్సెస్ మీట్ లో కాళ్ళ మీద పడి మరీ “ఏం కొట్టావయ్యా!” అని తెగ పొగిడేశాడు. అయితే.. ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, వాళ్లకి సరైన గుర్తింపు దొరకలేదు.
మళ్లీ వాళ్ల సినిమాల పాటలు హిట్ అయినా.. ఎందుకనో వాళ్లకు ఆశించిన స్థాయి పేరు రాలేదు. ఇద్దరూ చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్. పాపం.. హరి గౌరకి “హనుమాన్” సినిమా హిట్టైనా, పూర్తి క్రెడిట్ దొరకలేదు. అయితే ఇప్పుడు “మిరాయ్, కిష్కింధపురి” సినిమాలకి హీరో, డైరెక్టర్ తర్వాత పేరు తెచ్చుకున్న చేతన్ భరద్వాజ్, గౌర హరిలకు ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ఈ ఆఫర్లను వాళ్లు సరిగ్గా వినియోగించుకుంటే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఎదగడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. మరి ఈ విషయాన్ని వీళ్ళిద్దరూ ఎంత సీరియస్ గా తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే.. మంచి క్వాలిటీ ఉన్న మ్యూజిక్ ఇచ్చే టెక్నీషియన్స్ కొరత టాలీవుడ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్లిద్దరనే కాదు చాలా మంది టాలెంటెంట్ మ్యూజిక్ డైరెక్టర్లు మంచి గుర్తింపు కోసం వేచి చూస్తున్నారు. వాళ్లందరికీ ఈ తరహా సినిమాలు పడితే.. తెలుగు ఇండస్ట్రీ పరాయి భాషల సంగీత దర్శకుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.