‘లైగర్’ ఫ్లాప్ తర్వాత.. విజయ్ దేవరకొండను చాలామంది ట్రోల్ చేశారు. దానికి ఒక కారణం సినిమా ఫలితం అయితే, రెండో కారణం అతని యాటిట్యూడ్. అయితే ఈ రెండూ విజయ్ నెక్స్ట్ సినిమాల ఛాన్స్‌లపై ప్రభావం చూపించాయా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు విజయ్ కోసం ముగ్గురు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు విజయ్ ఓకే అంటే.. అప్పుడే సినిమా స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఇది చాలదా.. విజయ్ క్రేజ్ దర్శకుల దగ్గర ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పడానికి.
ఇక అసలు విషయానికొస్తే.. ‘లైగర్’ రిలీజ్ అయిన వెంటనే విజయ్ దేవరకొండ కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటాడని వార్తలొచ్చాయి. సినిమా కోసం శరీరం బాగా అలసిపోయిందని, అందుకనే రెస్ట్ అన్నారు. అయితే ‘ఖుషీ’ సినిమా షూట్ అయ్యాక ఈ రెస్ట్ ఉంటుందని చెప్పారు. తీరా చూస్తే ‘లైగర్’ ఢమాల్ అనిపించింది. దీంతో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే కెరీర్ పరంగా వెనకబడిపోతానని విజయ్‌కి అనిపించింది ఏమో.. వెంటనే షూట్‌కి రెడీ అన్నాడు. అయితే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు.
ఈ నేపథ్యంలో విజయ్‌కి కథ చెప్పారు అంటూ ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఓవరితో సినిమా చేసినా అదిరిపోయే అవుట్‌పుట్ వచ్చే అవకాశం ఉంది. విజయ్‌తో సినిమా అని వినిపిస్తున్న దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ చాలా నెలలుగా వెయిట్ చేస్తున్న హరీశ్‌కి ఇటీవల పవన్ క్లారిటీ ఇచ్చారు అని సమాచారం. ఇప్పట్లో సినిమా కుదరదు అని చెప్పారట. దీంతో విజయ్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారని టాక్. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉండొచ్చని సమాచారం.
ఇక రెండో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఇతను కూడా మెగా కాంపౌండ్ నుండి వచ్చినవాడే. రామ్‌చరణ్ – యూవీ క్రియేషన్స్ కాంబోలో ఓ సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఆ సినిమా వర్కవుట్ కాక బయటకు వచ్చేశారు. చరణ్‌కు చెప్పిన కథను విజయ్‌కి వినిపించాని అంటున్నారు. విజయ్ ఓకే అనుకుంటే అదే కథను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా ఉండొచ్చు అంటున్నారు. ఒకవేళ ఆ కథ వద్దంటే.. వేరే కథ సిద్ధం చేస్తారట.
ఫైనల్‌గా విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకునే ‘గీత గోవిందం’ కాంబో. ఆ సినిమా దర్శకుడు పరశురామ్ విజయ్‌తో పని చేయడానికి సిద్ధమంటున్నారు. ఇందులో కథానాయికగా రష్మికనే అనుకుంటున్నారట. ఈ కాంబోను గీతా ఆర్ట్స్‌లో మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అలా మొత్తం ‘గీత గోవిందం 2’ ప్లాన్ చేస్తున్నారు. మరి ఇందులో విజయ్ ఓటు దేనికో చూడాలి. ఏదేమైనా ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత కూడా విజయ్‌కి ఇన్ని అవకాశాలు అంటే గ్రేట్ అనే చెప్పాలి.