తెలుగు సినిమా అయినా, తెలుగు సినిమా మేకర్స్ అయినా తమిళ జనాలకు,అక్కడ ఫిలిం మేకర్స్ కి ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. నార్త్ జనాలకు, ఫిలిం మేకర్స్ కి కూడా అంతే..! కానీ తమిళియన్స్ లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ పెద్ద సినిమాలు మనం చూస్తాం. అక్కడ చిన్న హీరో, కొత్త హీరో అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ఎక్కువగా ఎంకరేజ్ చేసేది మన టాలీవుడ్ అనే చెప్పాలి. కానీ తమిళ జనాలకు అలా ఉండదు. గతంలో ఒక సందర్భంలో శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ ‘చిరంజీవితో సినిమా ఎందుకు చేయలేదు?’ అనే ప్రశ్న ఎదురైతే దానికి ఆయన సమాధానం ఇస్తూ ఈ విషయంపై ఓపెన్ అయ్యారు.
తమిళ హీరోలను తెలుగు ప్రేక్షకులు ఆదరించినట్లు.. తెలుగు హీరోలను తమిళ జనాలు యాక్సెప్ట్ చేయరు అనేది శంకర్ అభిప్రాయం. అందుకే శంకర్ కూడా ఫామ్లో ఉన్నన్ని రోజులు తెలుగు హీరోలతో సినిమాలు చేయలేదు. ఎప్పుడైతే అతన్ని తమిళ స్టార్ హీరోలు పక్కన పెట్టారో.. అప్పుడు వచ్చి చరణ్ వంటి స్టార్ తో ‘గేమ్ ఛేంజర్’ చేశాడు. ఆల్మోస్ట్ అందరు తమిళ డైరెక్టర్లు అంతే.
అయితే ఒక తమిళ డైరెక్టర్ మాత్రం తెలుగులోనే 2 హిట్ సినిమాలు అందించాడు. అతను మరెవరో కాదు తిరుపతి స్వామి. 1998 లో వచ్చిన ‘గణేష్’ సినిమాని డైరెక్ట్ చేసింది ఇతనే. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వెంకటేష్ కి బెస్ట్ హీరోగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే 2000 సంవత్సరంలో నాగార్జునతో ‘ఆజాద్’ చేశారు. అది కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ 2 సినిమాలను కమర్షియల్ గా డీల్ చేయడంతో పాటు ఓ బలమైన సామాజిక అంశాన్ని కూడా టచ్ చేశారు. తమిళంలో విజయ్ కాంత్ తో ‘నరసింహ’ అనే సినిమా చేశాడు. అది ఆడలేదు. తెలుగులో మాత్రం ఇతనికి పెద్ద హీరోల నుండి పిలుపు వచ్చింది. స్వతహాగా జర్నలిస్ట్ అయినటువంటి తిరుపతి స్వామి.. ఎవ్వరూ ఊహించని విధంగా 2001 లో కార్ యాక్సిడెంట్లో మరణించారు. ఆ టైంకి ఆయన వయసు కేవలం 32 ఏళ్ళు మాత్రమే కావడం బాధాకరం.