ఒక స్టార్ హీరో సినిమా అనగానే అనేక రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. కథ దగ్గర్నుంచి కాస్టింగ్ వరకు.. టైటిల్ నుంచి ఎండ్ కార్డు వరకు జాగ్రత్తగా ఉండాలి. హీరో, డైరక్టర్ కి నచ్చితే సరిపోదు.. అభిమానులు కూడా సంతృప్తి పడాలి. అందుకే మహేష్ బాబు కోలీవుడ్ ఎంట్రీ చిత్రానికి పది దాక పేర్లను పరిశీలించారు. చివరికి స్పైడర్ ని ఓకే చేశారు. ఆ ఇబ్బంది ఉండకూడదని సినిమాకి ప్రారంభానికి ముందే భరత్ అనే నేను అనే టైటిల్ ని ఫిక్స్ చేసి కొరటాల శివ టెన్షన్స్ ని తగ్గించుకున్నారు. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ మూవీ చేస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరిగింది.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ గోవాలో మొదలుకానుంది. నెక్స్ట్ షెడ్యూల్ అమెరికాలో సాగనుంది. దీనికి “రాజసం”, “రైతుబిడ్డ” అనే టైటిల్స్ అనుకున్నారు. ఇవేమి నచ్చలేదని టాక్. ఈ కథ రైతులతో ముడిపడిన అంశం కావడం, స్టూడెంట్ బ్యాక్ గౌండ్ ఉండడం, మహేష్ రేంజ్ కు తగ్గ టైటిల్ ను ఎంపిక చేయడం చిత్ర యూనిట్ కు తలకు మించిన భారంగా మారింది. వచ్చే నెల 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ 25 వ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రివీల్ చేయాలి. అప్పట్లోపున టైటిల్ ఓకే చేయడం వంశీ బృందానికి పెద్ద సవాలుగా మారింది.