టాలీవుడ్‌కు పోలీస్ పాత్రలు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు మాస్, మరోవైపు సెంటిమెంట్, యాక్షన్‌ను కలబోసే స్టోరీలలో ఖాకీ పాత్రలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పుడు మళ్లీ అదే మూడ్ సినిమాల్లో కనిపిస్తోంది. స్టార్ హీరోలు (Heroes) వరుసగా పోలీస్ పాత్రలతో తెరపై అడుగుపెడుతున్న తీరును చూస్తుంటే, ఖాకీ డ్రెస్‌తోనే బాక్సాఫీస్‌ను కదిలించాలన్న ఉద్దేశమే స్పష్టంగా కనిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం నటిస్తున్న హిట్: ద థర్డ్ కేస్లో (HIT 3) అర్జున్ సర్కార్ పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలే సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. మే 1న ఈ సినిమా విడుదల కానుండగా, నాని ఖాతాలో మరో హిట్ ఖచ్చితంగా చేరబోతోందనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది.
ఇక మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) మాస్ జాతర (Mass Jathara) అనే పోలీస్ డ్రామాతో మళ్లీ మాస్ మూడ్‌లోకి రావాలని చూస్తున్నారు. వరుస ఫ్లాపుల తరువాత ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న మాస్ రాజా, తన ఇమేజ్‌కు సరిపోయే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో మెప్పించబోతున్నాడు. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది.
ప్రభాస్(Prabhas) కూడా తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. ఒక్క పోస్టర్ కూడా రాకపోయినా ఇండస్ట్రీలో బలమైన బజ్ అయితే ఉంది.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా ఖాకీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో కింగ్‌డమ్ (Kingdom) అనే సినిమాతో పోలీస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారు. మే 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు కీలకంగా మారనుందన్న ప్రచారం ఉంది.
ఇక మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా మరోసారి పోలీస్ డ్రెస్ ధరించేందుకు సిద్ధమవుతున్నాడు. గత ఫ్లాపులు మరచి, మళ్లీ ‘హిట్’ (HIT) తరహాలో గట్టి కంబ్యాక్ ఇవ్వాలన్నది అతని లక్ష్యం. మొత్తానికి టాలీవుడ్‌లో మళ్లీ ఖాకీ జాతర మొదలైంది. మరి ఏ హీరో హై లెవెల్‌లో హిట్ కొడతాడో వేచి చూడాలి.