Tollywood: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌… ఓవర్సీస్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్లు.. ఎందుకంటే?

సినిమా ప్రచారాన్ని ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కించడం తెలుగు సినిమా పరిశ్రమకు అలవాటు. ఏ ఇతర భాషల సినిమాల పరిశ్రమలో లేని ప్రచార విధానాలు మన దగ్గర గత కొన్నేళ్లలో చూశాం. ఇప్పుడున్న జోరు చూస్తుంటే ఈ జోరు ఇంకా పెరిగేలా ఉంది. అయితే ఇక్కడో విషయం ఏంటి అంటే.. కొత్త విధానాల కోసం వెళ్లి తెలుగు సినిమాలకు తెలుగు నాట ప్రచార కార్యక్రమాలు లేకుండా చేస్తున్నారు. తెలుగు (Tollywood) సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు.

Tollywood

అయితే మన దగ్గర చేసే ప్రచార కార్యక్రమాలు తగ్గిపోయాయి. సినిమా విడుదలకు ముందు ఒక ఈవెంట్‌ పెట్టి మమ అనిపించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్లను విదేశాలకు తీసుకెళ్తున్నారు. దీంతో మన సినిమా ప్రచారం మనకు దూరమైపోతోంది అనే బాధ ఒకటి మొదలైంది. కావాలంటే మీరే చూడండి మొన్నీమధ్య రామ్‌చరణ్‌(Ram Charan)  ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను యూఎస్‌ఏలో నిర్వహించనున్నట్లు టీమ్‌ తెలిపింది.

ఆ దేశంలో ఇది తొలి తెలుగు సినిమా ఈవెంట్‌ అని గొప్పగా చెప్పారు. ఇప్పుడు మరో సినిమా ఆ దారిలోకి వచ్చింది. అదే ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj). సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా ప్రచారాన్ని అమెరికాలో చేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు జనవరి 4న అమెరికాలోని డల్లాస్‌లో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తామని చిత్రబృందం తెలియజేసింది. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)   సరసన శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath)  , ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) నటించారు.

ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మన సినిమా వేడుక ఇలా విదేశాల్లో జరగడం బాగానే ఉన్నా.. మన దగ్గర ప్రచారం ఆపేయకుండా, లేదంటే తగ్గించకుండా ఉంటే బాగుంటుంది అనే మాటను కూడా చిత్రబృందాలు పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పటికే ‘కల్కి 2893 ఏడీ’(Kalki 2898 AD), ‘దేవర’ (Devara) సినిమా ప్రచారాలు మన దగ్గర కాస్త తక్కువగానే జరిగాయి.

శోభితా – చైతూ.. పెళ్లితో OTT డీల్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus